మాజీ ఎమ్మెల్సీ, అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ టీడీపీ ఇన్‌చార్జ్ బత్యాల చెంగల్రాయులు త్వరలో వైసీపీలో చేరనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. బత్యాలకు కాకుండా రాయచోటి నుంచి సుగవాసి బాలసుబ్రమణ్యాన్ని తీసుకొచ్చి రాజంపేట అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఐదేళ్లుగా రాజంపేటలో పార్టీ కోసం ఖర్చు పెట్టుకుని పని చేస్తున్న తనను కాదని సుగవాసికి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్న.
ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో వుంటానని ఆయన రాజంపేట నియోజకవర్గం వ్యాప్తంగా కలియ తిరుగుతున్నారు. రాజంపేటలో భారీ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన కూడా చేశారు. మరోవైపు సుగవాసి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. దీంతో రాజంపేటలో టీడీపీ రెండుగా చీలిపోయింది. బత్యాలకు రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో బలిజల్లో మంచి పట్టు వుంది. దీంతో ఆయన్ను పార్టీలో చేర్చుకుంటే బాగుంటుందని వైసీపీ పెద్దలు పావులు కదిపారు.
ఈ క్రమంలో వైసీపీలో చేరడానికి బత్యాల కూడా మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యం ఇస్తామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే బత్యాల వైసీపీలో చేరడానికి ఇబ్బందులు ఉండవు.
వైసీపీలో బత్యాల చేరితే రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో టీడీపీకి భారీ దెబ్బ అని చెప్పక తప్పదు. టీడీపీ స్వీయ తప్పిదాలతో చేజేతులా నష్టపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.