ఆ తెలుగుదేశం నేత‌కు వైఎస్ జ‌గ‌న్ ఆహ్వానం?

క‌ర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసింది. వైఎస్ జ‌గ‌న్ సునామీలో తెలుగుదేశం పార్టీ చిత్త‌య్యింది. 14 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గానూ 14 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్…

క‌ర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసింది. వైఎస్ జ‌గ‌న్ సునామీలో తెలుగుదేశం పార్టీ చిత్త‌య్యింది. 14 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గానూ 14 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌య‌దుందుభి మోగించింది. ఆ ఎమ్మెల్యే స్థానాల‌కు తోడు రెండు ఎంపీ సీట్ల‌లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజ‌యం దక్కింది. 

విజ‌యాలే కాదు.. మెజారిటీలు కూడా కీల‌క‌మైన అంశాలు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 వేలు, అంత‌కు మించిన మెజారిటీనే ద‌క్కింది. అయితే కొన్ని చోట్ల మాత్రం తెలుగుదేశం పార్టీ కొద్దో గొప్పో పోటీ ఇచ్చింది. అక్క‌డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ కాస్త త‌గ్గింది. అది కూడా పార్టీ బ‌లం క‌న్నా, క్యాండిడేట్ల బ‌లం కీల‌క‌మైన‌ది. అలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి బ‌న‌గాన‌ప‌ల్లె.

ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాట‌సాని రామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున నెగ్గారు. తెలుగుదేశం త‌ర‌ఫు నుంచి పోటీ చేసిన బీసీ జ‌నార్ధ‌న్ రెడ్డి స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓట‌మి పాల‌య్యారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చిన మెజారిటీ 13 వేల స్థాయిలో ఉంటుంది. తెలుగుదేశం పార్టీ చెప్పుకోద‌గిన స్థాయిలో పోటీ ఇచ్చిన నియోజ‌క‌వ‌ర్గం ఇది.

మరి ఇలాంటి చోట్ల వ‌చ్చే సారి తెలుగుదేశం పార్టీ కాస్త గ‌ట్టి పోటీనే ఇచ్చే అవ‌కాశాలు ఉంటాయ‌నేది స‌హ‌జ‌మైన లెక్క‌. ఆ సంగ‌త‌లా ఉంటే.. ఇక్క‌డి తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే బీసీ జ‌నార్ధ‌న్ రెడ్డికి ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నుంచి ఆహ్వానం అందుతోంద‌ని స‌మాచారం. జ‌నార్ధ‌న్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవ‌డానికి జ‌గ‌న్ ఆస‌క్తితో ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.

మ‌రి వ‌చ్చి చేరితే.. ఇదే అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గం టికెట్ ఇస్తారో, లేక మ‌రో ప్ర‌తిపాద‌న ఏమైనా ఉందో కానీ.. బీసీ జ‌నార్ధ‌న్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత స్థాయి నుంచినే ఇన్విటేష‌న్ ఉంద‌నే టాక్ న‌డుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో జ‌నార్ధ‌న్ రెడ్డికి మంచి పేరుంది. ఎన్నిక‌ల్లో ఓట‌మి సంగ‌త‌లా ఉంచితే..అంత‌కు ముందు ఆయ‌న ఒక‌సారి ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రించారు. అయిన‌ప్ప‌టికి నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ఆయ‌న‌కు సానుకూలత అయితే ఉంది. 

గ‌త ఎన్నిక‌ల్లో క‌ర్నూలు జిల్లాలో మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల‌తో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజ‌క‌వ‌ర్గం మెజారిటీ త‌గ్గ‌డం జ‌నార్ధ‌న్ రెడ్డి ఫ్యాక్ట‌రే అనుకోవ‌చ్చు. మ‌రి ఇప్పుడు జ‌నార్ధ‌న్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర‌వ‌చ్చ‌నే ఊహాగానాలు న‌డుస్తున్నాయి. ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా.. ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం ఊపందుకున్నాకా అయినా ఇది జ‌ర‌గ‌వ‌చ్చంటున్నారు. మ‌రి అదే జ‌రిగితే.. పోటీ ఇవ్వ‌గ‌ల అభ్య‌ర్థి చేజారితే టీడీపీకి అది శ‌రాఘాతం అవుతుంది.