బంగారంపై రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు కూడా అత్యుత్సాహం చూపిస్తూ ఉంటాయి. ఒకవేళ రుణం ఎగవేసినా సరే.. జప్తు చేయడానికి బంగారం తమవద్ద ఉంటుంది కదా అనే ధీమా ఇందుకు కారణం. అదే సమయంలో.. వ్యవసాయం పేరిట పొలం ఉన్నట్లుగా ఏదో ఒక పత్రం చూపిస్తే… చాలు వ్యవసాయ అవసరాలకు అన్నట్లుగా బంగారం తాకట్టుతో రుణాలు తీసుకోమంటూ బ్యాంకుల వాళ్లే ప్రేరేపిస్తూ ఉంటారు కూడా.
ఈ వ్యవహారంలో చిన్న మతలబు ఉంది. పొలం ఉన్నట్లుగా ఓ కాగితం జిరాక్సు పెడితేచాలు. వాటికి కేంద్రం ఇచ్చే వడ్డీ రాయితీ వర్తిస్తుంది. అంటే ఒక జిరాక్సు కాగితంతో బంగారం కుదువపెట్టి అతి తక్కువ వడ్డీకి వ్యవసాయం కోటాలో రుణం తీసుకుని.. దాన్ని యథేచ్ఛగా ఇతర వ్యాపారావసరాలకు ఖర్చు చేసుకోవచ్చునన్నమాట. వ్యవసాయం చేయనివారు, తమ పొలాలను ఇతరులకు కౌలుకు ఇచ్చినవారు కూడా.. ఇలా డాక్యుమెంట్ మాత్రం చూపించి.. బంగారంపై అతితక్కువ వడ్డీతో రుణాలు పొందుతూ ఉంటారు. బ్యాంకులు కూడా ఎగబడి ఇచ్చేస్తుంటాయి.
అయితే ఇలాంటి ఒకరకం మోసాలకు మోడీ సర్కార్ చెక్ పెట్టేసింది. ఇకమీదట బంగారం తాకట్టు పెట్టినా కూడా, నిజంగా వ్యవసాయం చేస్తున్నవారికి మాత్రమే వడ్డీ రాయితీగల రుణం దక్కుతుంది. సేద్యం చేయనివారు.. పొలం ఉన్నంత మాత్రాన, బంగారంపై వడ్డీ రాయితీతో రుణం పొందలేరు. అక్టోబరు 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది.
రైతులకు.. ఎకరాకు ఎంత రుణం ఇవ్వాలనే విషయాన్ని.. ఏ పంట వేస్తున్నారనే దాన్ని బట్టి నిర్ణయిస్తారు. వారికి మాత్రమే వడ్డీ రాయితీ లభిస్తుంది. ఏడాదిలోగా తిరిగి పూర్తిగా చెల్లించకపోయినా కూడా రాయితీ రద్దవుతుంది. అంటే.. ఏ పంట అయినా సరే ఏడాదిలోగా పూర్తవుతుందనే ఉద్దేశంతో ఈ నిబంధన పెట్టారు. దీనివలన వాస్తవంగా సేద్యం చేసేవారు మాత్రం లబ్ధిపొందుతారు.
అయితే ప్రభుత్వం ఇంకో చర్య తీసుకోవాల్సి ఉంది. రైతుకు ఇచ్చే వడ్డీ రాయితీతో పాటు ప్రభుత్వమే పంటబీమా ప్రీమియం చెల్లింపు కూడా చెల్లిస్తే గనుక.. వైపరీత్యాలు వచ్చినా, విధి వంచించినా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడినట్లు అవుతుంది.