మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇప్పటికే ఊహించని వివాదాల్లో చిక్కుకున్నారు. దివంగత భూమా నాగిరెడ్డి కి అతి సన్నిహితుడిగా పేరున్న ఏవీ సుబ్బారెడ్డి పై హత్యాయత్నం విషయంలో అఖిలప్రియపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తనపై అఖిలప్రియ హత్యాయత్నం చేయించిందని ఏవీ సుబ్బారెడ్డి స్వయంగా ఆరోపించారు. ఏవీ సుబ్బారెడ్డి కూతురు ఈ విషయంలో స్పందించి అఖిలప్రియపై దుమ్మెత్తి పోసింది. ఈ క్రమంలో ఇన్నాళ్లూ అతి సన్నిహితంగా మెలిగిన వాళ్లు ఇలా హత్యాయత్నాల ఆరోపణల వరకూ వచ్చే సరికి అఖిలప్రియ ఇబ్బందుల్లో పడుతున్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ దొరక్క, మరోవైపు ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో అఖిలప్రియ రాజకీయం ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది.
మరోవైపు ఆళ్లగడ్డ నియోజకవర్గం స్థాయిలో అఖిలప్రియ భర్త అతి జోక్యం స్థానికులు సహించడం లేదనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఆయన స్థానికేతరుడు. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో, అఖిలప్రియ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రతి వ్యవహారంలోనూ జోక్యం చేసుకుంటున్నారనే ప్రచారం వచ్చింది. ఎంత అఖిలప్రియ భర్త అయినప్పటికీ ఆయన జోక్యాన్ని క్యాడర్ కూడా అంత సహించలేకపోయింది. ఎన్నికల్లో అఖిలప్రియ ఓడిపోయారు. ఆ తర్వాత జగనన్న అంటూ కొన్నాళ్లు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలూ జరిగాయి.
ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖిలప్రియ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నట్టే. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో భూమా నాగిరెడ్డి, అఖిలప్రియలు జగన్ కు దూరంగా వెళ్లిపోయారు. తెలుగుదేశంలో చేరాకా.. అఖిలప్రియ కొన్ని సార్లు అనుచితంగా కూడా మాట్లాడింది. తనేదో తెలుగుదేశం పార్టీ తరఫునే పోటీ చేసి గెలిచినట్టుగా ఆమె మాట్లాడారు. జగన్ పై ఆమె చేసిన విమర్శలు ప్రహసనం పాలయ్యాయి. ఏతావాతా భూమా ఫ్యామిలీ రాజకీయంగా ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉంది.
ఇప్పుడు విశేషం ఏమిటంటే.. అఖిలప్రియ ఇక పై తెర వెనుక రాజకీయ వ్యూహాలకే పరిమితం కాబోతున్నారనేది. ఇప్పుడు ఆమె తమ్ముడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తెర పైకి రానున్నారనేది. ఇప్పటికే జగన్ విఖ్యాత్ తెరపైకి వచ్చేశారు కూడా. ఈ మధ్యనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి, అక్కడ అధికారులపై దౌర్జన్యం చేసి.. తమ అనుచరుడొకడిని విడిపించుకురావడం ద్వారా జగత్ విఖ్యాత్ వార్తల్లోకి వచ్చాడు. ఈ తరహా రాజకీయం చాలా పాతకాలం నాటిది! దీన్నో హీరోయిజంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు రాజకీయ నేతలు. తన తండ్రి కాలం నాటి రాజకీయం చేశాడు జగత్ విఖ్యాత్. ఈ విషయంలో పోలీసుల తీరు మీద విమర్శలు వచ్చాయి. దీంతో స్టేషన్లో చేసిన దౌర్జన్యానికి గానూ విఖ్యాత్ మీద కేసు నమోదైనట్టుగా సమాచారం.
ఇలా భూమా నాగిరెడ్డి తనయుడు తెర మీదకు వచ్చేసినట్టే అని, వచ్చే ఎన్నికల నాటికి తనే లీడర్ గా ప్రొజెక్ట్ అయ్యేందుకు అతడు ప్రయత్నాలు ప్రారంభించినట్టే అని సమాచారం. మరీ ఆ రేంజ్ లో పోలిస్ స్టేషన్ కు వెళ్లి హల్చల్ చేయడం అనేది పొలిటికల్ గ్రాండ్ ఎంట్రీ ప్రయత్నమే అని చెప్పాలి. ఇప్పుడు అనుచవర్గంతో మాటలూ, చేతలూ అన్నీ కూడా భూమా జగన్ విఖ్యాతే చేస్తున్నాడని సమాచారం. మాజీ మంత్రి అయిన అఖిలప్రియ ఇక తెరవెనుక మంత్రాంగాలకే పరిమితం అవుతారని, తెర ముందు రాజకీయం అంతా ఇక విఖ్యాత్ కనుసన్నల్లో సాగుతుందని భూమా అనుచవర్గం చెబుతోంది! మరి ఇదెలా ఉంటుందో!