సుడిగాడు విజయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నా

అల్లరి నరేష్. ఫ్యామిలీ ఫ్యామిలీకి నచ్చే హీరో. నవ్వుల పువ్వులు ఇంటింటా విరజిమ్మే హీరో. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న అల్లరి నరేష్ పుట్టిన రోజు రేపు (జూన్30). ఈ నేపథ్యంలో…

అల్లరి నరేష్. ఫ్యామిలీ ఫ్యామిలీకి నచ్చే హీరో. నవ్వుల పువ్వులు ఇంటింటా విరజిమ్మే హీరో. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న అల్లరి నరేష్ పుట్టిన రోజు రేపు (జూన్30). ఈ నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూ.

ముందుగానే శుభాకాంక్షలు మీకు.

థాంక్యూ అండీ..

ఎన్నో ఏట అడుగుపెట్టబోతున్నారు. అడగొచ్చా..

దానికేం భాగ్యం. 39కి వస్తున్నా. మరో ఏడాది దాటితో అంకుల్స్ బ్యాచ్ లోకి వచ్చేస్తా. అప్పుడు అందరూ అన్నా అనే బదులు అంకుల్ అంటారు.

ఇండస్ట్రీలో మీకన్నా ఏజ్ ఎక్కువ వున్న హీరోలే చాలా మంది వున్నారుగా..నో ప్రోబ్లమ్.

అది కాదు…అన్న నుంచి అంకుల్ అయిపోతా..అదీ విషయం. 

మీ నాన్నగారి లేని లోటు పర్సనల్ గా కన్నా, కెరీర్ మీద ఇంకా ఎక్కువ ప్రభావం చూపించిందేమో?

అలా అని చెప్పలేం. నాన్నగారితో పాటు వచ్చిన చాలా మంది డైరక్టర్లు ఇప్పుడు అవుట్ డేట్ అయిపోయారు అని అంటున్నారు అంతా. ఫాదర్ బతికి వుండి సినిమాలు తీస్తూ వుంటే అలాగే అనేవారేమో? ఒకటి వాస్తవం. ఆయన నాతో చేసిన సినిమాల్లో 90 శాతం కామెడీనే. ఆయన స్ట్రెంగ్త్ కూడా అదే.కానీ ఆ కామెడీ ఇప్పడు చూస్తారా? ఏమో? అప్పట్లో కోటా-బాబు మోహన్ ఒకరిని ఒకరు కొట్టుకుంటే కామెడీ. కానీ ఇప్పుడు అలా చూడడం లేదు. అభిరుచులు మారుతున్నాయి.

ఒక్కప్పుడు కామెడీ జోనర్ అంటే రాజేంద్రప్రసాద్ కు, ఆ పైన మీకు వదిలేసారు.కానీ ఇప్పుడు అందరూ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ నే నమ్ముకున్నారు. అందువల్ల కూడా మీకు సమస్య అవుతోందా?

ఇది కూడా కరెక్ట్ కాదేమో? ఎందుకంటే కంటెంట్ బాగుంటే కామెడీ పెద్ద సినిమాలో వున్నా చూస్తారు, చిన్న సినిమాలో వున్నా చూస్తారు. కంటెంట్ తెచ్చుకోవడంలో వుంది. అదే ఇప్పుడు కష్టంగా వుంది. 

సుడిగాడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఆ తరువాత..

అదే నాకు పెద్ద సమస్య అయింది. సుడిగాడు సినిమా పెద్ద విజయం సాధించింది. దాన్ని మేం తప్పుగా అర్థం చేసుకున్నాం. కేవలం కామెడీ వల్లే ఆడిసింది అనుకున్నాం. ఇంతకన్నా ఎక్కువ కామెడీ ఇస్తే ఇంకా ఆడేస్తుంది అనుకున్నాం. కానీ కామెడీతో పాటే, ఇంతో అంతో కథ, కంటెంట్ వుండాలని అర్థం అయింది.

నాంది అంటూ మళ్లీ డిఫరెంట్ ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మీరు ఇలా డిఫరెంట్ గా ట్రయ్ చేసిన వాటిలో సక్సెస్ రేటు తక్కువ కదా.

ట్రయ్ చేసినవే తక్కువ. వాటిలో అటు ఇటు రెండు రకాలు వున్నాయి. మహర్షి సినిమాలో నేను అస్సలు కామెడీ చేయలేదు. జనాల నుంచి అభినందన వచ్చింది. ఆ ధైర్యంతోనే నాంది సినిమా చేస్తున్నాను.

ఏమిటి ఈ నాంది?

ఇదో రా ఫిలిం. పొలీసులు, ఇంటరాగేషన్, జైలు, అక్కడ పరిస్థితులు, ఇవన్నీ కలిసిన థ్రిల్లర్.

మారుతున్న కాలంలో మారుతున్న సాంకేతికత ను గమనిస్తున్నారా?

చూస్తున్నా. ఓటిటి గురించే కదా మీరు అడిగేది. ఫ్యూచర ఓటిటిదే అవుతుంది. కానీ ఇప్పట్లో కాదు. ఇంకా టైమ్ పడుతుంది. మనం అనుకునే బి సి సెంటర్లకు ఓటిటి చేరాల్సి వుంది. 

మన హీరోలు ఓటిటి మీదకు రావడానికి కాస్త జంకు వుందేమో? జనం ఏమని కామెంట్ చేస్తారో అనే జంకు.

ఓటిటి పాపులర్ అయితే అది కూడా ఓ మీడియం అయిపోతుంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, థియేటర్లో వంద సినిమాలు విడుదల అయితే 20 హిట్, 80 ఫ్లాప్. అది మనకు తెలుస్తోంది. కానీ ఓటిటి లో కూడా ఇదే పరిస్థితి వుంది. కానీ మనం ఫ్యామిలీ మన్ గురించో, స్పెషల్ యాప్స్ గురించో మాట్లాడుకుంటాం. మిగిలినవి పట్టించుకోం.అక్కడ కూడా ఫెయిల్యూర్ రేటు ఎక్కువగానే వుంది.

నటుడిగా సరే, నిర్మాతగా ఒటిటి లోకి మీ బ్యానర్ ను తీసుకెళ్తారా?

తప్పుకుండా. కథలు వింటున్నాం. ఇక్కడ సమస్య ఏమిటంటే, రెండు గంటలు నవ్వించడమే కష్టం. అలాంటిది వెబ్ సిరీస్ లో నాలుగైదు గంటలు నవ్వించాలంటే, అంత కంటెంట్,అంత స్టామినా వున్న కథలు కావాలి. వాటి కోసం వెదుకుతున్నాం. ఇక్కడ ఇంకో సమస్య కూడా వుంది. మన దగ్గరకు వచ్చేసరికి నాలుగయిదు కోట్ల లిమిటెడ్ బడ్జెట్ ఆఫర్ చేస్తున్నారు. ఆర్టిస్టు రెమ్యూనిరేషన్, ప్రోడక్షన్ అన్నీ ఇందులోనే అంటే, క్వాలిటీ ఎలా? 

కరోనా టైమ్ లో ఎలా గడుపుతున్నారు.

ఇంట్లో చిన్న పిల్లలు వున్నారు. అందుకే మార్చి 15 నుంచి ఇప్పటి వరకు బయట అడుగుపెట్టలేదు.

ఎప్పటికి పరిస్థితి మారుతుందని మీ అంచనా.

మరో మూడునెలలు ఇలాగే వుంటుందేమో? అక్టోబర్ నుంచి సర్దుకుంటుందని అనిపిస్తోంది. కానీ అన్ని రంగాలు ఎఫెక్ట్ అయ్యాయి. మన రోజువారీ కూలీల గురించి, ఉద్యోగుల గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ ఇండస్ట్రీలో అంతకన్నా పైన వున్న వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది పిల్లల ఫీజులు, ఇతరత్రా వ్యవహారాలు. హైదరాబాద్ లో వుండలేక, అలా అని పిల్లలను తీసుకుని పల్లెటూర్లకు వెళ్లలేక. వింటుంటే చాలా కష్టంగా వుంటోంది.

మీరు మీ ఊరు వెళ్తున్నారా..మీ నాన్నగారు కట్టిన ఇల్లు అది..అక్కడ వున్నాయిగా.

మార్చిలో వెళ్లి వచ్చాను. మా తాతగారు అక్కడే వుంటున్నారు. ఆయనకు అక్కడ వుండడమే ఇష్టం. బాబాయ్ కూడా అక్కడకు షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ నేను, అన్నయ్య, మా ఫ్యామిలీలు, అమ్మ వుంటున్నాం.

మీరు సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్ గా వుండరు?

ఎందుకు వుండాలి? సినిమాల విడుదలప్పుడు అంటే మన బాధ్యత. మనం చేయాలి. మిగిలినవి మన పర్సనల్. నేనేు ఎక్కడికన్నా వెళ్తే మంచి దృశ్యం చూస్తే ఫొటో తీస్తే షేర్ చేసుకుంటాను. అంతే కానీ రోజూ నేనేం చేస్తున్నాం, ఏం తింటున్నాం, నా పిల్లలు ఏం చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకో నాకు ఇష్టం వుండదు. ఎవరి ఇష్టం వారిది. నాకు ఇలా వుండడమే ఇష్టం.మా నాన్నగారు వున్నపుడు కూడా మేము ఫొకస్ లో లేము. మమ్మల్ని ఫోకస్ లో వుంచాలని డాడీ అనుకోలేదు. మా పాప నాకు సరదా కానీ, జనాలకు ఎందుకు?

కొత్త సినిమాల ప్లానింగ్ ఎలా వుంది?

రెండు కథలు ఒకె చేసాను. కానీ లాక్ డౌన్ టైమ్ కదా? ఎవరు మాత్రం ఇప్పుడు ఏం చేయగలరు. నాంది సినిమాకే ఇంకా పది రోజుల పని వుంది. 150 మందితో చేయాల్సిన సీన్లు వున్నాయి. సాధ్యం కాదు. పైగా పరిస్థితులు ఇలా వుంటే ఎవరు మాత్రం అర్జెంట్ గా సినిమాల మీద పెట్టుబఢి పెడతారు. అన్నీ సర్దుకున్నాక మొదలు పెడతాం. 

థాంక్యూ అండీ..మరోసారి మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

థాంక్యూ అండీ

-వి.రాజా