సౌత్ ఇండియాలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో ఎలాగైనా దాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ అధిష్టానం గట్టి కసరత్తే చేస్తోంది. ఈ ఏడాదిలో జరగబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఇప్పటికే బీజేపీ కేంద్ర అధినాయకత్వం రంగంలోకి దిగింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇలా ముఖ్య నేతలంతా ఇప్పటికే రాష్ట్రంలో అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక పర్యటనలో భాగంగా మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి యడ్యూరప్పనే బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికే ఈ భేటి జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో బీజేపీ పెట్టుకున్న సిద్ధాంతంలో భాగంగా యడ్యూరప్పను సీఎం హోదా నుంచి తప్పించి ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్ బొమ్మెని నియమించింది. తిరిగి ఇప్పుడు బీజేపీ అధిష్టానం చూపు ఆ కురువృద్ధుడుపై పడినట్టుగా ఉంది!
బసవరాజ్ బొమ్మైని సీఎం చేసినప్పటి నుండి ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు, వివాదాలు చుట్టుముడుతున్నాయి. దాంతో ఎన్నికల ముందుగానే బొమ్మైను సీఎం పీఠం నుండి దించి యడ్యూరప్పకి అప్పగించబోతున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. అందుకే ప్రధాని- యడ్యూరప్ప ప్రత్యేక భేటీ జరిగిందంటున్నారు.
నాలుగోసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే నాటికి యడ్యూరప్ప వయసు 76ఏళ్లు కాగా.. పార్టీ నిబంధనల ప్రకారం 75 ఏళ్లు దాటితే ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం కావాలి. చివరకు 78 సంవత్సరాల వయస్సులో ముఖ్యమంత్రి పీఠం నుండి బీజేపీ అధిష్టానం ఆయనను దింపేసింది. ఇప్పుడు మళ్లీ మరిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 79ఏళ్లలో తిరిగి సీఎం పీఠం ఎక్కబోతున్నారంటే అది ఆసక్తిదాయకమైన అంశమే!