జనసేనతో పొత్తు చర్చల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. గత కొంత కాలంగా నియోజక వర్గాల వారీగా చంద్రబాబు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు. ఉదాహరణకు డోన్, నగరి, కడప, రాజంపేట లోక్‌సభ అభ్యర్థులతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ తిరిగి సీట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికి 120కి పైగా నియోజకవర్గాలపై సమీక్షించారని సమాచారం. చంద్రబాబు తన సహజ ధోరణికి విరుద్ధంగా ఎంతో ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తున్నారనే చర్చకు తెరలేచింది.
అయితే జనసేనతో పొత్తు అంశం తెరపైకి రావడంతో టీడీపీ అభ్యర్థుల ప్రకటనకు బ్రేక్ పడినట్టు సమాచారం. ఇవాళ్టి నుంచి మళ్లీ నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలకు శ్రీకారం చుట్టారు. కడప, నంద్యాల, భీమవరం, రాజోలు తదితర నియోజక వర్గాల ఇన్‌చార్జ్‌లతో ఆయన పార్టీ స్థితిగతులపై ఆరా తీయనున్నారు. అయితే ఇంతకు ముందులా వెంటనే అభ్యర్థులను ప్రకటించడం సాధ్యం కాదని టీడీపీ నేతలు అంటున్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి జనసేనాని పవన్‌కల్యాణ్ పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
ఇప్పుడు పొత్తు ఉంటుందని పవన్‌కల్యాణ్ ప్రకటించడంతో సీట్లపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. అలాంటి చోట ముందే అభ్యర్థులను ప్రకటిస్తే కొత్త సమస్యలు వస్తాయనే భయం చంద్రబాబును వెంటాడుతోంది.
ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు టికెట్ కేటాయించే అవకాశం లేదనే నియోజకవర్గానికి మాత్రమే అభ్యర్థిని చంద్రబాబు ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. మిగిలిన చోట్ల పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై బాబు దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.