బీజేపీతో జనసేన సంచారం మూణ్ణాళ్ల ముచ్చటేనా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అదేంటో కానీ పవన్ దృష్టిలో జీవితం, రాజకీయం, సినిమాకు పెద్దగా తేడా ఉన్నట్టు లేదు. సినిమా అంటే రెండు లేదా రెండున్నర గంటల ఎంటర్‌టైన్‌మెంట్ అని ఎలా భావిస్తామో…జీవితమన్నా, రాజకీయమన్నా కూడా అంతే అన్నట్టు పవన్ నిర్ణయాలు తెలియజేస్తున్నాయి.
ఏదీ ఒక దానితో పవన్ సంతృప్తి చెందేలా లేడు. జీవితమంటే ఆయన వ్యక్తిగతం. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా…ఎదుర్కోవాల్సి ఆయనే కాబట్టి రెండో వ్యక్తికి సమస్య లేదు. రాజకీయమంటే అలా కాదు. రాజకీయమంటే సమష్టి తత్వం. రెండు చేతులు కలిస్తేనే చప్పుడు అయినట్టుగానే, పది మంది ఆలోచనలు, అభిప్రాయాలు, ఆచరణ కలిస్తేనే విజయ పథం వైపు నడిచే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా పూటపూటకో నిర్ణయం తీసుకుంటూ నిలకడ లేని తనాన్ని ప్రదర్శిస్తే భంగపాటు తప్పదు.
రాజకీయాలెప్పుడూ నిలకడతనాన్ని కోరుకుంటాయి. పవన్‌కల్యాణ్ రాజకీయాలు…ప్రాథమిక నియమనిబంధనలకే విరుద్ధంగా ఉన్నాయి. పిల్లి తన పిల్లలను ప్రతి నిమిషానికి మార్చినట్టు పవన్‌కల్యాణ్ రాజకీయ పొత్తులు కూడా మారుతున్నాయి. ఎప్పుడు, ఎవరితో ఎన్నాళ్లుంటారో ఆయనకే తెలియని దుస్థితి.
రాజధాని రైతులతో శనివారం పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ చేసిన కీలక వ్యాఖ్యలు ఆయన బీజేపీతో కొనసాగడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని తాను నమ్మడం లేదని, ఒకవేళ వైసీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీతో జనసేన ఉండదని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పాడు. ‘బీజేపీతో వైసీపీ కలిస్తే తప్పు లేదని..కానీ అందులో జనసేన ఉండదని' స్పష్టం చేశాడు.
పవన్ వ్యాఖ్యలు బీజేపీని బెదిరించడానికా లేక మరేమైనా ఉద్దేశంతో అన్నాడా అన్నది ప్రస్తుతానికి తెలియరావడం లేదు. కానీ ఈ వ్యాఖ్యలు మాత్రం పవన్ తొందరపాటు తనానికి, రాజకీయ అజ్ఞానానికి నిదర్శనంగా చూడాలి.
ఎందుకంటే బీజేపీ -వైసీపీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించాడు. ఐటీ దాడుల చర్చను పక్కదారి పట్టించేందుకు టీడీపీ ఓ పథకం ప్రకారం తన ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చేస్తున్న దుష్ప్రచారంగా ఆయన కొట్టి పడేశాడు.
ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా…పొత్తులపై ఏమీ లేకుండానే పవన్ స్పందించడం విడ్డూరంగా ఉంది. పవన్ కామెంట్స్ చూస్తుంటే బీజేపీతో జనసేనాని ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టనిపిస్తోంది. బీజేపీ నుంచి బయటకు వచ్చేందుకు సాకు కోసం వెతుకుతున్నట్టు అనిపిస్తోంది.
ఒకటికి రెండు మూడు సార్లు పవనే ఢిల్లీ వెళ్లి…బీజేపీతో కోరి పొత్తు పెట్టుకున్న జనసేనానికి ఇప్పుడు ఆ పార్టీతో వచ్చిన ఇబ్బందులేవో చెబితే బాగుంటుంది. అలాగే ఆ ఇబ్బందులను బీజేపీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటే మంచిది.