కనురెప్పే కాటేస్తే…ఇక అన్యాయం గురించి ఎవరికి చెప్పుకోవాలి? ఏమని చెప్పాలి?
రక్షణగా నిలవాల్సిన పోలీసులే కామాంధులై ఒంటరి యువతిని చెరపట్టి…సామూహిక అత్యాచారానికి పాల్పడిన హృదయ విదారక సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకొంది. సభ్య సమాజం తలదించుకునే ఈ అమానవీయ ఘటన వివరాలిలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలోని గోరఖ్‌నాథ్‌లో ట్యూషన్ టీచర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల యువతి తన అక్క ఇంటికి వెళ్లి తిరిగి బయల్దేరింది. ఆ యువతి వెనకే తల్లి కూడా బయల్దేరింది. ఒంటరిగా వెళుతున్న యువతిపై పోలీసుల కన్నుపడింది. ఇద్దరు పోలీసులు ఆ యువతిని అడ్డుకున్నారు. నీవు ఎవరు? ఎక్కడికి పోతున్నావ్? అని ప్రశ్నిస్తూ ఆమెను అడ్డుకున్నారు.
తాను ఫలానా అని చెప్పినా వారు వినిపించుకోలేదు. ఆమెతో అమర్యాదగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. ‘ఏయ్, నువ్వు వేశ్యవు కదా..’ అని ప్రశ్నించారు. దీంతో ఆ అమ్మాయి భయాందోళనకు గురైంది. జరగపోయే ప్రమాదాన్ని పసిగట్టింది. అయితే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఎందుకంటే రక్షించాల్సిన వాళ్లే భక్షకులుగా మారిన క్షణం. భయంభయంగా తాను అలాంటి దాన్ని కాదని, తన వెనకాల కొద్ది దూరంలో తల్లి కూడా వస్తోందని ఆ యువతి చెప్తున్నా వారు వినిపించుకోలేదు. ఒంటరిగా వెళుతున్న యువతిని చూడగానే వాళ్ల మనసుల్లో చెడు ఆలోచనలు పుట్టాయి. అందుకు తగ్గట్టుగానే వారు ప్రవర్తించారు.
ఆ యువతిని బలవంతంగా తమ బైకుపై ఎక్కించుకొని.. రైల్వేష్టేషన్ దగ్గర్లోని ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించగా తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఆ తర్వాత కొన్ని గంటలు గడిపాక ఆ రాత్రిపూట ఆమె చేతిలో రూ. 600 పెట్టి వెళ్లిపొమ్మన్నారు. జీవశ్చవంలా ఆమె ఆటోలో ఇంటికి చేరింది. పోలీసుల పైశాచికత్వానికి తాను బలి అయ్యానని కన్నీరుమున్నరవుతూ తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.