గత కొన్నాళ్లుగా జాతీయ మీడియాతో చాలా సాన్నిహిత్యంగా ఉన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. తన ప్రత్యర్థి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జాతీయ మీడియా ద్వారా లేనిపోని కథనాలను రాయించడం మీద చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారనే ప్రచారమూ సాగుతూ ఉంది. రాయిటర్స్ లో కియా మీద వచ్చిన కథనం అయినా, ఆ తర్వాత ఎకనామిక్ టైమ్స్ వాళ్లు జగన్ పై రాసిన ఒక అనుచితమైన కథనం అయినా.. అదంతా చంద్రబాబు నాయుడి స్పాన్సర్షిప్ తో వచ్చినదే అనే ప్రచారం సాగుతూ ఉంది. ఆ సంగతలా ఉంటే.. ఉన్నట్టుండి నేషనల్ మీడియాకు చంద్రబాబు స్పందన అవసరం అయ్యింది. అది ఆయన మాజీ పీఎస్ వద్ద ఐటీ దాడుల్లో బయటపడిన అక్రమాస్తుల గురించి!
చంద్రబాబు నాయుడి మాజీ పీఎస్ శ్రీనివాస్ వద్ద భారీ ఎత్తున అక్రమాస్తులను ఐటీ శాఖ గుర్తించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై చంద్రబాబు స్పందన తీసుకోవాలని జాతీయ మీడియా వర్గాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయట. చంద్రబాబు మాజీ పీఎస్ వద్ద లభించిన అక్రమాస్తులతో ఆయనకు సంబంధం ఉందనే ప్రచారం గట్టిగా సాగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఎక్స్ పీఎస్ ఈ స్థాయిలో కూడబెట్టాడంటే చంద్రబాబు ఆస్తులు మురేస్థాయిలో ఉంటాయనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ కథనాలను కవర్ చేస్తున్న నేషనల్ మీడియా చంద్రబాబు స్పందన కోసం ప్రయత్నాలు సాగిస్తూ ఉందట.
ఈ విషయాన్ని ఒక మీడియా సంస్థ ధ్రువీకరించింది. ఐటీ శాఖ గుర్తించిన అక్రమాస్తుల గురించి, చంద్రబాబు వాయిస్ తీసుకునే ప్రయత్నం జరిగిందని, అయితే చంద్రబాబు మాత్రం అందుబాటులో లేరని ఆ మీడియా వర్గం ఒకటి పేర్కొంది. చంద్రబాబు స్పందన కోసం ఫోన్ చేసినట్టుగా, మెయిల్ కూడా పెట్టినట్టుగా అయితే.. ఆయన నుంచి మాత్రం ప్రతిస్పందన లేదని ఒక జాతీయ మీడియా సంస్థ ప్రముఖంగా పేర్కొంది.
ఇలా చంద్రబాబు నాయుడు మీడియాకు అందుబాటు లో లేకుండా పోవడం గమనార్హం.ఐటీ శాఖ ప్రెస్ నోట్ విడుదల దగ్గర నుంచి చంద్రబాబు హైదరాబాద్ చేరుకుని తన వాళ్లతో తర్జనభర్జనల్లో ఉన్నట్టుగా మరో ప్రచారం సాగుతూ ఉంది.