నిలకడలేని వంగవీటి రాధా కోసం తమ నాయకుడికి అన్యాయం చేస్తారా? అనే నిలదీత మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు అనుచరుల నుంచి వస్తోంది. ఎన్నికల సమయంలో మాత్రమే రాధాకు రాజకీయాలు గుర్తొస్తాయని ఉమా అనుచరులు మండిపడుతున్నారు. పార్టీలో రాధా కొనసాగడం వల్ల టీడీపీలో జోష్ పెరిగిందని ప్రచారం చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. లోకేశ్ పాదయాత్రలో వంగవీటి పాల్గొనడంపై టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
లోకేశ్‌తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ మార్పుపై సుదీర్ఘంగా చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. లోకేశ్‌తో భేటీ అనంతరం రాధా మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో వారంలో రెండుసార్లు పాదయాత్రలో పాల్గొంటానన్నారు. దీంతో జనసేనలోకి రాధా వెళ్తారనే ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడిందని టీడీపీ అనుకూల మీడియా సంబరపడుతూ వార్తల్ని ఇస్తోంది.
2004లో కాంగ్రెస్ తరపున వంగవీటి రాధా గెలుపొందారు. అప్పుడు వైఎస్సార్ హవాలో ఆయన చట్టసభలో అడుగు పెట్టారు. 2009లో కులాభిమానంతో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓడిపోయారు. 2014లో ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. తీరా జగన్ అధికారంలోకి వస్తారనుకునే తరుణంలో టీడీపీలో రాధా చేరారు. కాపుల ఓట్ల కోసం రాధాతో ప్రచారం చేయించారు. జగన్‌ను తిట్టించారు. అయినప్పటికీ కాపులెవరూ ఆయనకు మద్దతుగా నిలవలేదు.
2019 తర్వాత అప్పుడప్పుడు మాత్రమే రాధా కనిపిస్తున్నారు. అది కూడా వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలతో కలిసి రాధా కనిపిస్తుంటారు. వాళ్లిద్దరూ టీడీపీకి బద్ధ శత్రువులనే సంగతి తెలిసిందే. రాధా వ్యవహారశైలిపై టీడీపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నప్పటికీ, కాపుల ఓట్ల కోసం ఆయన్ని భరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ సమక్షంలో జనసేనలో చేరుతారనే ప్రచారం కొన్ని నెలలుగా సాగుతోంది. తాజాగా ఆ నిర్ణయం మార్చుకున్నట్టు కనిపిస్తోంది.
లోకేశ్‌తో భేటీ అనంతరం విజయవాడ సెంట్రల్ సీటు తమ నాయకుడికే ఇస్తారని రాధా అనుచరులు చెబుతున్నారు. దీంతో బొండా ఉమా వర్గీయులు మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో బొండా ఉమా ఓడిపోయారని, ఈ దఫా ఎలాగైనా గెలుస్తామని వారు ధీమా చేస్తున్నారు. ఓడిపోయినప్పటికీ పార్టీని బలోపేతం చేస్తున్న తమ నాయకుడికి కాకుండా వంగవీటి రాధాకు టికెట్ ఇస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయని వారు హెచ్చరిస్తున్నారు.
విజయవాడ సెంట్రల్ టికెట్ ఇస్తామనే భరోసాతోనే రాధా టీడీపీలో కొనసాగడానికి అంగీకరించారని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. విజయవాడ సెంట్రల్ టికెట్‌పై ఎవరి వాదనలు వారివే. తాను కోరుకున్న టికెట్ ఇవ్వకుంటే టీడీపీలో రాధా ఎందుకు కొనసాగుతారనే ప్రశ్నకు సమాధానం రావాల్సి వుంది.