ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ భారీగా బోగస్ ఓటర్లను చేర్పించిందంటూ వామపక్షాలు, టీడీపీ గగ్గోలు పెడుతున్నాయి. ఈ పార్టీలో ఏడ్పులు, పెడబొబ్బలు చూస్తుంటే… చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న చందాన్ని గుర్తు చేస్తోంది. ముఖ్యంగా తిరుపతిలో భారీగా బోగస్ ఓటర్లను నమోదు చేశారనే ప్రచారం జరుగుతోంది. తిరుపతిలో వైసీపీ కార్యాలయం చిరునామాతో ఏకంగా 30 మంది ఫేక్ గ్రాడ్యుయేట్ ఓటర్లను చేర్చారని, అలాగే మరొక చోట ఒకే ఇంటి చిరునామాతో 20 ఓట్లు నమోదు చేశారని ఆధారాలతో సహా ఆరోపిస్తున్నారు.
ఇలా తిరుపతిలో బోగస్ ఓటర్లకు సంబంధించి మీడియాకు వివరాలు అందజేస్తున్నారు. గతంలో ఇదే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో కూడా బోగస్ ఓటర్ల రచ్చ జరిగింది. గతంలో పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కూడా ఇదే రీతిలో తిరుపతి బోగస్ ఓట్ల కేంద్రంగా తీవ్ర రచ్చ సాగిందే.
ఎన్నికల రోజు బస్సుల్లో గుంపులుగుంపులుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు యత్నించడం, కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీల నేతలు పట్టుకోవడం గురించి తెలిసిందే. ఇదంతా పోలింగ్ బూత్ బయట సాగింది. అయితే పోలింగ్ కేంద్రాల్లో మాత్రం అంతా సాఫీగా సాగడంతో వైసీపీ ఊపిరి పీల్చుకుంది.
ఎమ్మెల్సీ ఎన్నికలకు కేవలం నాలుగైదు రోజుల ముందు బోగస్ ఓట్లు అంటూ వామపక్ష పార్టీలు, టీడీపీ రంకెలేస్తే లాభం ఏంటి? గతంలో తిరుపతి కలెక్టర్ నేతృత్వంలో ఓటర్ల జాబితా ఫైనల్ చేయడానికి ముందు అన్ని రాజకీయ పక్షాలతో రెండుసార్లు సమావేశాలు నిర్వహించారు. ఓటర్ల జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు వుంటే తెలియజేయాలని కలెక్టర్ కోరారు. అప్పుడు వామపక్ష పార్టీల నేతలు టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాపై మాత్రమే చిన్నచిన్న అభ్యంతరాలు చెప్పారు. ముఖ్యంగా ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి ఇన్వాల్వ్మెంట్పై ఫిర్యాదులు చేశారు.
ఇంతకు మించి ఓటర్ల జాబితాపై వామపక్షాలు, టీడీపీ, బీజేపీ నేతలు చేసిందేమిటి? ఒక్కసారి తుది ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత, అది కూడా ఎన్నికలకు నాలుగైదు రోజుల ముందు గగ్గోలు పెడితే ఏంటి లాభం? ఇప్పుడు ఓటర్ల జాబితా పరిశీలనపై ఉన్న శ్రద్ధ, నాడే కనబరిచి వుంటే, అసలు సమస్యే వుండేది కాదు కదా? ఆ పని అప్పుడెందుకు చేయలేకపోయారనే నిలదీతలు అధికార పక్షం నుంచి వస్తున్నాయి.