వైసీపీలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2004లో అక్కడ నుంచి మొదటిసారి పోటీ చేసి గెలిచారు. వైఎస్సార్ మంత్రివర్గంలోచోటు సంపాదించుకున్నారు.
2009లోనూ అదే సీటు నుంచి గెలిచి మంత్రి అయ్యారు. 2014లో విభజన పరిణామాల నేపధ్యంలో పోటీ చేస్తే గట్టి పోటీ ఇచ్చినా ఓటమిపాలు అయ్యారు. 2019లో మాత్రం మళ్లీ భారీ ఆధిక్యతతో చీపురుపల్లి నుంచి విజయం సాధించి జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు.
2024లో బొత్స చీపురుపల్లి నుంచి అయిదవసారి పోటీ చేస్తారా అంటే రకరకాలైన ప్రచారం సాగుతోంది. ఆయన ఈసారి విజయనగరం నుంచి పోటీకి దిగుతారు అని అంటున్నారు.
విజయనగరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు. ఆయన బలమైన వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు. అయితే విజయనగరం జిల్లాలో తూర్పు కాపులు అధికంగా ఉన్నారు. తెలుగుదేశం కూడా వారికే ఈసారి టిక్కెట్ ఇవ్వాలనుకుంటోంది. అదే కనుక జరిగితే కుల సమీకరణలో భాగంగా కోలగట్ల స్ధానంలో బొత్స రంగంలోకి దిగుతారు అని అంటున్నారు.
తన నివాసం సహా రాజకీయం అంతా విజయనగరం నుంచే బొత్స చేస్తూంటారు. ఆయనకు విజయనగరం సొంత ప్రాంతం లాంటిదే. ఈసారి చీపురుపల్లి నుంచి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పోటీకి దిగుతారు అని కూడా అంటున్నారు. మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.