గోడ మీద బీజేపీ రాజు గారు

విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికలలో గెలిచిన లక్కీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు. ఆ సీటు మీద ఎందరో ఉద్దండులు కన్ను వేసిన బలమైన లాబీయింగ్‌ ద్వారా చివరి నిముషంలో బీజేపీ తరఫున…

విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికలలో గెలిచిన లక్కీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు. ఆ సీటు మీద ఎందరో ఉద్దండులు కన్ను వేసిన బలమైన లాబీయింగ్‌ ద్వారా చివరి నిముషంలో బీజేపీ తరఫున టిక్కెట్‌ సంపాదించి పోటీ చేసి  రాజుగారు గెలిచారు. 

ఆ ఎన్నికలలో తెలుగుదేశం బీజేపీ పొత్తు జనసేన ప్రచారం ఆయనకు కలసివచ్చాయి. 2019లో బీజేపీ తరఫున ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్‌ గల్లంతు అయింది. 2024లో పొత్తులు ఉంటేనే బీజేపీ తరఫున పోటీకి దిగాలని రాజుగారు డిసైడ్‌ అయ్యారని ప్రచారం అయితే ఉంది. పొత్తులు లేకపోతే తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి కానీ సీటు సంపాదించి పోటీకి దిగి మళ్లీ ఎమ్మెల్యే కావాలని రాజుగారు ప్లాన్‌ రెడీ చేసి పెట్టుకున్నారుట. 

విశాఖ ఉత్తరం సీటును జనసేన పొత్తులో భాగంగా అడుగుతోంది. తెలుగుదేశం ఆ సీటును ఉంచుకుంటే కనుక ఆ పార్టీ కండువా కప్పేసుకుని చంద్రబాబు దయతో పోటీకి దిగాలని రాజుగారు ఆశపడుతున్నారు. తెలుగుదేశంలో అయితే పోటీ పెద్దగా లేదు. అయితే జనసేనకు కేటాయిస్తే ఆ పార్టీలో చేరి పోటీ చేయాలని ఆయన ఆలోచిస్తున్నారని టాక్‌. 

కానీ జనసేన సీటు అడుగుతోంది స్ధానికంగా ఉన్న తన పార్టీ నేతల కోసం అని అంటున్నారు. దాంతో రాజుగారు జన సైనికుడిగా మారినా కూడా పార్టీకి ప్రచారం చేసి పెట్టాలి తప్ప సీటు దక్కే ఛాన్స్‌ ఉండదని అంటున్నారు. 

ప్రస్తుతానికి మాత్రం రాజుగారు గోడ మీదనే ఉంటూ రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు అంటున్నారు. ఆయన వైసీపీని ఏకి పారేస్తూ మిగిలిన పార్టీల విషయంలో నోరు విప్పకుండా జాగ్రత్త పడుతున్నారుట.