రెండో కంటికి తెలియకుండా ఏదో గుప్పెడుమంది నాయకులతో బతికిపోతూ ఉంటే ఆ పార్టీ పరిస్థితి వేరు! ఏకతాటిమీద నడిచే పార్టీగా వారికి గుర్తింపు ఉంది. అధికారంలోకి వచ్చేయాలనే కలలతో విస్తరించే ఉద్దేశంతో ఎవరొస్తే వాళ్లను చేర్చేసుకుంటూ, అదే ఎదగడం అనుకుంటున్న పార్టీకి అసలు నొప్పులు ఇప్పుడు తెలుస్తున్నాయి. రాజధాని అనే పాయింటు మీద ఆ పార్టీలో అభిప్రాయ భేదాలు రచ్చకెక్కుతున్నాయి. తీర్మానం రూపేణా వాళ్లు అమరావతి రాజధానిని సమర్థించదలచుకున్నా.. లోలోపల విశాఖ తరలింపు ప్రతిపాదనకు జై కొడుతూనే ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండి తీరాలనే కోరిక భాజపా నాయకత్వంలో కొందరికి ఉంది. వాళ్లంతా.. అక్కడి రియల్ ఎస్టేట్ దందాలను నమ్ముకున్నట్లుగా, సాగిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరుకు చెందిన వాడే కావడం వల్ల.. అమరావతిని సమర్థించడం తన అవసరం అని ఆయన అనుకోవచ్చు. సుజనా చౌదరి విషయంలో ఆలోచించక్కర్లేదు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది ఆయన కూడా భారీస్థాయిలో పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన తరలిపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఒకవైపు భారతీయజనతా పార్టీ విధానాలకు నిదర్శనమా అన్నట్లుగా.. రాష్ట్ర రాజధాని వ్యవహారంతో కేంద్రానికి సంబంధం లేదని.. కేంద్ర హోం సహాయమంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పేస్తున్నారు. కానీ.. రాష్ట్ర భాజపా మాత్రం అంత బ్యాలెన్స్‌డ్ గా ఉండలేకపోతోంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులైన నాయకులు.. అమరావతికోసం పోరాడాలి అని అంటుండగా.. ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాత్రం జగన్ ప్రభుత్వం ఆలోచనలనే సమర్థిస్తున్నారు.
ఈ విషయంలో సుజనా , జీవీఎల్ మధ్య మాటల ఎన్ కౌంటర్లు కూడా జరిగిన సంగతి ప్రజలకు తెలిసిందే. అదే తరహాలో రాజధానిపై తమ విధానం తేల్చడానికి నిర్వహించిన పార్టీ సమావేశం కూడా హాట్ హాట్ గానే సాగింది. పార్టీలోని విభేదాలు బయటకొచ్చాయి. తీర్మానం మాత్రం.. అమరావతికి మద్దతివ్వాలనే నిర్ణయించారు. జమిలిగా అటు చంద్రబాబు మీద, ఇటు జగన్ మీద విమర్శలు కురిపించారు. కానీ వాస్తవంలో ఆ పార్టీ ఏ విధానంతో ముందుకెళుతుందో గానీ.. వారి మధ్య ఉన్న రచ్చలు మాత్రం బయటపడుతున్నాయి.