రాజధాని ముసుగులో పవన్ విలీన భేటీలు!

పవన్ కల్యాణ్ తన పార్టీ జనసేనను భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడానికి తొందర పడుతున్నారా? పార్టీ నిర్వహణలో ఇప్పటికే వాగా అలసిపోయి.. ఎప్పుడెప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వెళ్లి సినిమాలు చేసుకుందామా అనే…

పవన్ కల్యాణ్ తన పార్టీ జనసేనను భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడానికి తొందర పడుతున్నారా? పార్టీ నిర్వహణలో ఇప్పటికే వాగా అలసిపోయి.. ఎప్పుడెప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వెళ్లి సినిమాలు చేసుకుందామా అనే ఆత్రుతలో ఉన్న పవన్ కల్యాణ్.. పార్టీని కమలజలంలో కలిపేయడానికి బేరాలాడ్డానికి ఢిల్లీ వెళ్లారా? ఇప్పటికే ఒక విడత పూర్తయిన చర్చల నేపథ్యంలో.. రాజధాని తరలింపుపై కేంద్రానికి ఫిర్యాదు అనే ముసుగులో.. ఆయన విలీన బేరం మాట్లాడుకోవడానికి ఢిల్లీ చేరారా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

పవన్ కల్యాణ్ ఉన్నపళంగా మళ్లీ ఢిల్లీ వెళ్లారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో తమ మూడు పార్టీలూ విడివిడిగా పోటీచేయడం వల్ల మాత్రమే.. వైకాపా గెలిచిందని పవన్ వ్యాఖ్యానించారు. ఆ మాటల్లో నిజం లేకపోయినా.. తమ మూడు పార్టీల మైత్రి రాష్ట్రానికి అవసరం అని ఆయన ఆ రకంగా ప్రజలకు సంకేతం ఇచ్చారు. ఆ మూడు పార్టీలు మళ్లీ కలిసినా ఆశ్చర్యపోకుండా ఉండేందుకు జనాల్ని ప్రిపేర్ చేశారు.

ఆ వెంటనే.. ఆయన బయల్దేరి ఢిల్లీ వెళ్లారు. ఆదివారం నాడు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా లలో ఎవరితో వీలైతే వారితో భేటీ అయ్యే అవకాశం ఉంది. అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి పవన్ వెళ్లినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ ఆ దిశగా పవన్ సాధించేదీ ఏమీ ఉండదన్నది వాస్తవం. నిజానికి ఆ ముక్క ఆయన ఢిల్లీ పెద్దలతో ప్రస్తావించకపోయినా కూడా ఆశ్చర్యం లేదు. కేవలం స్వకార్యం చక్కబెట్టుకోవడం ఒక్కటే ఆయన ఎజెండాలో ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్, గతంలో కూడా నాదెండ్ల మనోహర్ ను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. ఆయన ఆ పర్యటనను చాలా రహస్యంగా ఉంచుకున్నారు. ఏదో చీకటి పనులు చేస్తున్నంత చాటుమాటుగా ఢిల్లీలో తిరిగి, వెనక్కు వచ్చారు. ఇప్పుడు పర్యటన గురించి కూడా చాలా గోప్యతను పాటిస్తున్నారు. మొత్తానికి విలీన చర్చల భేటీనే అవుతుందనేది పలువురి అంచనా. కాకపోతే విలీనం వెంటనే అవుతుందా… కొన్నాళ్ల తరువాత అవుతుందా? అనేది మాత్రం వేచిచూడాలి.