Advertisement

Advertisement


Home > Politics - Gossip

మోడీకి ఇంత ఖర్మ పట్టిందేమిటో పాపం!

మోడీకి ఇంత ఖర్మ పట్టిందేమిటో పాపం!

ఆయన ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాని. కానీ.. ఈ దేశంలో రోడ్డు మీద తిరగడానికి భయపడిపోతున్నారు. విదేశాలలో పర్యటిస్తూ.. భారతీయులు తనను చూడడానికి రోడ్డు పక్కన గుమికూడినప్పుడు హఠాత్తుగా కాన్వాయ్ లోని కార్లు ఆపించేసి.. రోడ్డు పక్కకు వెళ్లి.. వాళ్లందరితో కరచాలనాలు చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ ముచ్చట్లు చెప్పుకునే నరేంద్రమోడీ.. ఇప్పుడు తన సొంత దేశంలో కనీసం రోడ్డు మీద కాన్వాయ్ తో ప్రయాణించడానికి కూడా జంకుతున్నారంటే.. ఏం అనుకోవాలి?

ప్రధాని మోడీ తాజాగా కోల్‌కతలో పర్యటించారు. సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్సీ లపై దేశవ్యాప్తంగా సాగుతున్నట్లే బెంగాల్ లో కూడా పెద్దఎత్తున నిరసనలు ఉన్నాయి. అక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వీటిని వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశాలపై పునరాలోచన జరగాలని.. కేంద్రం వీటిని వెనక్కు తీసుకోవాలని.. తమ రాష్ట్రంలో మాత్రం వీటిని అనుమతించబోయేది లేదని.. మమత ఆయనకు తెగేసి చెప్పేశారు. ఈ అంశాలపై చర్చించడానికి ప్రధాని ఆమెను ఢిల్లీకి ఆహ్వానించారు. ఢిల్లీ వస్తే ఏం చర్చిస్తారో.. బిల్లుల్లో ఏదైనా మార్పులు తెస్తారో, లేదా వెనక్కి తగ్గుతారో వేచిచూస్తే తప్ప తెలియదు.

కానీ ఇక్కడ గమనించాల్సిన మరో పరిణామం ఉంది. కోల్‌కతలో విమానం దిగిన ప్రధాని తాను పాల్గొనవలసిన కార్యక్రమం ఉన్న వేదికవద్దకు ముందుగా ప్లాన్ చేసినట్లుగా రోడ్డు మార్గంలో వెళ్లడానికి కూడా జంకారు. నగరమంతా నిరసన ప్రదర్శనలున్నాయి.. విశాలమైన ఛాతీ ఉన్న ప్రధానిగా ధైర్యం గురించి తనను తాను అభివర్ణించుకునే మోడీ, రోడ్డు వదిలేసి నగరంలో స్థానికంగా హెలికాప్టర్‌లో ప్రయాణించారు. ఇలాంటి పలాయనవాదం ఆయనకు ఇవాళ కొత్త కాదు. గతంలో కావేరీ జలాల వివాదం రేగుతున్నప్పుడు తమిళనాడుకు వెళ్లిన ప్రధాని కూడా.. అప్పట్లో అక్కడి నిరసనలను భరించలేక.. హెలికాప్టర్లోనే వేదికకు చేరుకున్నారు. మదరాసీలు తక్కువ తినలేదన్నట్లుగా.. పెద్దపెద్ద నల్లటి బెలూన్లపై నిరసన నినాదాలు రాసి.. ఆయన హెలికాప్టర్ మార్గంలో వాటిని గాల్లోకి ఎగురవేసి మరీ తమ నిరసన తెలిపారు.

పాలించే సొంత దేశంలో ఇలా భయంగా తిరిగే ఖర్మ మోదీకి ఎందుకు? ప్రజల నిరసనల్లో నిజం ఉన్నదేమో.. కాస్తంత సంయమనంతో ఆలోచిస్తే ఆయనదేం పోతుంది అనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?