ఊహకు అందని మిస్టరీ సినిమా తరహాలో సాగుతున్నాయి ఏపీలో జరిగిన ఐటీ రైడ్స్ తదనంతర పరిణామాలు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మాజీ పీఎస్ అయినటువంటి పి.శ్రీనివాస్ పై ఐటీ రైడ్స్ వ్యవహారం పెను సంచలనం దిశగా సాగేలా ఉంది. అంత వరకూ మీడియాలో పెద్దగా హైలెట్ కాని శ్రీనివాస్ ఇళ్లపై జరిగిన ఐటీ రైడ్స్ తో సంచలన విషయాలు బయట పడ్డాయని ఐటీ శాఖ ప్రెస్ నోట్ విడుదల చేయడం, ఆపై తెలుగుదేశం పార్టీ అందుకు సంబంధించిన పంచనామాలో ఒక పేజీని మాత్రమే చూపించి జనాలను బ్లఫ్ చేయాలని చూడటం , ఆ ప్రయత్నం బెడిసి కొట్టడం ఇవన్నీ ఆసక్తిదాయక పరిణామాలుగా మారాయి.
ఇక ఐటీ రైడ్స్ వ్యవహారం లోకి నేడో రేపో ఈడీ ఎంటర్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ నేత, సోనియాగాంధీ అంతరంగికుడు అహ్మద్ పటేల్ కు నోటీసులకు మూలాలు కూడా ఏపీ లో జరిగిన ఐటీ రైడ్సే అనే వార్తలు వస్తూ ఉండటం మరింత సంచలనంగా మారింది. అహ్మద్ పటేల్.. ఏపీలో కాంగ్రెస్ రాజకీయాలు నడిచిన రోజుల్లో ఈ పేరు తరచూ వినిపించేది. ఇలాంటి వాళ్ల సలహాలుసూచనల ఫలితంగానే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలా తయారైందనే అభిప్రాయాలూ ఉన్నాయి.
ఇక ఆ మధ్య సొంతరాష్ట్రం గుజరాత్ నుంచి అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక కావడం వెనుక పెద్ద తతంగం నడిచింది. ఈ పటేల్ ను రాజ్యసభలో అడుగుపెట్టనివ్వకూడదని మోడీ, షా గట్టిగా ప్రయత్నించారంటారు. అయితే.. అది వారి తరం కాలేదు! అహ్మద్ పటేల్ రాజ్యసభ సభ్యుడిగా నెగ్గారు! దాని వెనుక కాంగ్రెస్ చాలా రాజకీయం నడిపిందనే వార్తలూ వచ్చాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో క్యాంపు నడపడంతో అహ్మద్ పటేల్ విజయం సాధ్యమైంది. అయితే ఆ క్యాంపు ఖర్చులు భారీగా ఉన్నాయనే టాక్ అప్పట్లోనే వినిపించింది. ఆ ఖర్చులన్నీ కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ పెట్టుకున్నారు అనే వార్త అప్పట్లో వచ్చింది.
కానీ ఇప్పుడు ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారంలో అహ్మద్ పటేల్ కు నోటీసులు, ఆ నాలుగు వందల కోట్ల రూపాయలు ఏపీ నుంచి వెళ్లాయనే ప్రచారం.. ఇవన్నీ మరింత సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే అహ్మద్ పటేల్ అరెస్టుకు కూడా రంగం సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఆయన ఇప్పటికే హాస్పిటల్ లో చేరాడట. ఏపీలో ఒక తెర వెనుక ఉన్న ఒక చోటా వ్యక్తిని ఐటీ శాఖ కదిలిస్తే.. గుజరాత్ లో ఒక పటేల్ హాస్పిటల్ చేరాడటంటే వీటి బంధం ఏమిటో అంతుబట్టకుండా ఉంది.
ఆ సంగతలా ఉంటే.. అహ్మద్ పటేల్ క్యాంప్ రాజకీయం వెనుక పైకి కనిపించింది డీకేశి అయినా, అదృశ్యహస్తం చంద్రబాబుది అనే టాక్ వస్తూ ఉండటం అసలైన కొసమెరుపు. అహ్మద్ పటేల్ కు అందిన నిధుల మూలాలు ఏపీ ఖజానాకు సంబంధించినవి అనే సంచలన ప్రచారం జరుగుతూ ఉంది. వేరే ఎవరికైనా చంద్రబాబు ఇలాంటి సాయాలు చేసి ఉన్నా అదో లెక్క. పోయి పోయి అహ్మద్ పటేల్ కు చంద్రబాబు నాయుడు నుంచి సాయాలు ఏవైనా అంది ఉంటే మాత్రం.. ఆయన డీప్ ట్రబుల్ లోకి పడిపోయినట్టే.. అందులో మరో డౌట్ లేనట్టే అని పరిశీలకులు అంటున్నారు!