చంద్రబాబు మర్యాద పోయేది ఇందుకే!

ఏపీ  అసెంబ్లీ   సమావేశాలు  వాడిగా  వేడిగా  జరుగుతున్నాయి.  పాలక-  ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలను  ఘాటుగా  సంధించుకుంటున్నాయి.  గాడితప్పకుండా  అర్థవంతమైన చర్చలతో జరిగితే గనుక.. ఇలాంటి  విమర్శ- ప్రతివిమర్శలు ప్రజాస్వామ్యానికి మంచిదే. కానీ.. తెలుగుదేశం పార్టీ, అధినేత చంద్రబాబునాయుడు…

ఏపీ  అసెంబ్లీ   సమావేశాలు  వాడిగా  వేడిగా  జరుగుతున్నాయి.  పాలక-  ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలను  ఘాటుగా  సంధించుకుంటున్నాయి.  గాడితప్పకుండా  అర్థవంతమైన చర్చలతో జరిగితే గనుక.. ఇలాంటి  విమర్శ- ప్రతివిమర్శలు ప్రజాస్వామ్యానికి మంచిదే. కానీ.. తెలుగుదేశం పార్టీ, అధినేత చంద్రబాబునాయుడు సారథ్యంలో.. అర్థం పర్థంలేని విమర్శలకు దిగుతూ.. తమ పరువు తామే తీసుకునే బాటలో పయనిస్తోంది. ప్రజలు కాస్త జాగ్రత్తగా గమనిస్తే చాలు, తమ అర్థం లేని వాదనల్ని, విమర్శల్ని ఈసడించుకుంటారనే భయం కూడా వారికి కలగడం లేదు.

జగన్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచింది. అధికారిక గణాంకాల ప్రకారమే 2015 నాటినుంచి ఇప్పటిదాకా 50 శాతానికి పైగా  డీజిలు ధరలు పెరగ్గా.. ఆర్టీసీ బస్సు చార్జీలు పెరగలేదు. సంస్థ విపరీతంగా నష్టాల్లో కూరుకుపోతూ ఉంది.

పొరుగున అన్ని రాష్ట్రాల్లోనూ ధరలు పెరిగిన నేపథ్యంలో ఏపీలో కూడా పెంచారు. అప్పటికీ తెలంగాణలోలాగా కాకుండా.. జగన్ పేదల పక్షపాతిగా వ్యవహరించారు. సాధారణ, సిటీ బస్సులకు పదిపైసలు మాత్రమే పెంచి, ఎక్స్‌ప్రెస్ లగ్జరీ సర్వీసులకు మాత్రమే 20 పైసలు వంతున పెంచారు. ఇంతకంటె పేదలకు అనుకూలంగా పెంచడం ఎవ్వరికీ సాధ్యం కాదు.

అయినా.. తెలుగుదేశం పార్టీ ఆర్టీసీ చార్జీలపెంపుపై రాద్ధాంతం చేసింది. ప్రతిపక్షం గనుక.. ధరల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకించడం ప్రభుత్వాన్ని కాస్త జాగరూకతవైపు నడిపిస్తుందని అనుకుంటే.. ఇది మంచిదే. అంతవరకు సమర్థించవచ్చు. కానీ.. పెంపు గణాంకాలను తమ ఇష్టం వచ్చేసినట్లుగా మార్చేస్తున్నారు.

టికెట్ల ధరలు పెంచిన రోజున ఈ నిర్ణయం వల్ల ఏడాదికి 700 కోట్ల భారం ప్రజలపై పడుతుందని.. అంతా లెక్కలు కట్టి చెప్పారు. తెదేపా కూడా అదే పాట పాడింది. ఇవాళ అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తే సమయానికి వారు మొత్తం లెక్కలు మార్చేశారు.

2000 కోట్ల భారం ప్రజలపై మోపుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాన్ని బద్‌నాం చేయడానికి నోటిలెక్కలాగా మరీ 700కు బదులుగా 2000 కోట్లుగా చెప్పడం అనేది.. అచ్చంగా ఆ పార్టీకే పరువు నష్టం. ఒక విధానం లేకుండా.. నోటికొచ్చినట్లుగా విమర్శిస్తే ప్రజలు కూడా వారిని పట్టించుకోరు అని చంద్రబాబు తెలుసుకోవాలి.

నిజానికి ఏడాదికి పెరిగే భారం 700 కోట్లు కావొచ్చు. రోజుకు 1.15 కోట్ల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తారు. ఏడాదికి సుమారు 420 కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. వీరిమీద 700 కోట్ల భారం అంటే.. ఒక ప్రయాణికుడి మీద ఏడాదికి సగటున 1.6 రూపాయల భారం పడినట్టు లెక్క. కానీ.. అదంతా పేదలపై పడే భారం కాదు.

ఈ ప్రయాణికుల సంఖ్యలో సగానికి పైగా ఆర్డినరీ బస్సుల్లో తిరుగుతుంటారనుకుంటే.. వారిమీద పడే భారం.. పదిపైసల వంతునే..! ప్రజలు ఏమాత్రం పట్టించుకోని ఇలాంటి అంశాన్ని లేవనెత్తి.. పైగా తప్పుడులెక్కలతో డిమాండ్లు వినిపిస్తూ పోరాటాలు సాగిస్తే ప్రజలు అసహ్యించుకుంటారని తెలుగుదేశం తెలుసుకోవాలి.