ఎవరైనా తమలోని ఒక లక్షణం గురించి ప్రత్యేకంగా పదేపదే చెప్పుకోవాలని అనుకుంటున్నారంటే.. ఆ లక్షణం వారిలో లేకున్నా సరే, ప్రపంచం మొత్తం గుర్తించాలని వారు పరితపించి పోతున్నట్లు అర్థం. ‘నేనసలు అబద్ధాలే చెప్పనే’ అని ఎవడైనా తన గురించి పదేపదే చెప్పుకుంటే.. వాడికి అబద్ధాల కోరుగా చాలా కీర్తి ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఈ సిద్ధాంతాన్ని ఇప్పుడు మోడీ సర్కారుకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా వర్తింపజేసి చూసుకోవాలి.
పౌరసత్వ సవరణ బిల్లు తేవడం ద్వారా.. మోడీ సర్కారు ఒక దుర్మార్గానికి ఒడిగట్టింది అని ప్రజలు భావిస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ భాజపాకు చాలినంత బలం ఉన్నది గనుక.. ఏ నిర్ణయం తీసుకున్నా సరే.. వారు యథేచ్ఛగా చెలరేగగలరు గనుక… ఇలాంటివన్నీ చట్టాలుగా వచ్చేయవచ్చు. కానీ వీటికి ప్రజల మద్దతు మాత్రం లేదన్నది స్పష్టం.
పైగా ఈ బిల్లు వల్ల దేశంలోని ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదు అని అమిత్ షా అంటున్నారు. వారికి ఎలాంటి వేధింపులు ఉండవు అంటున్నారు. దాని అర్థం.. వేధింపుల గురించి.. దేశంలోని ముస్లింలు అందరూ భయవిహ్వలతకు లోనవుతున్నారని! మౌలికంగా లౌకిక ప్రజాస్వామ్య దేశమైన మనలో.. ఒక మతం వారు భయపడే పరిస్థితి ఎందుకు దాపురించింది. వేధింపులు ఉంటాయా? లేదా? అనేది వేరే సంగతి… ముందు ఒక మతం భయపడే వాతావరణం ఏర్పడినందుకు కేంద్ర సర్కారు బాధ్యత వహించాలి.
ఈ బిల్లు వల్ల.. వలస వచ్చిన వారందరికీ పౌరసత్వం దక్కి.. వారు మన భారతీయ సుహృద్భావ సమాజంలో భాగస్వాములు కాగలిగితే.. అది ఆహ్వానించదగిన పరిణామమే. ప్రతి ఒక్కరూ కూడా సంతోషిస్తారు. ఎటూ తమ తెగలు అంతరించిపోతాయని భయపడుతున్న ఈశాన్య రాష్ట్రాల వారి భయాలను ప్రభుత్వం పరిగణిస్తోంది. అక్కడ ఈ చట్టానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కాకపోతే.. కొత్తగా పౌరసత్వాలు ఇవ్వడానికి మతం అనేది ఒక ప్రాతిపదిక కావడమే చాలా హేయంగా కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా ముస్లింలను వేరు చేసి చూస్తున్నట్లుగా ఉంది. వారి అస్తిత్వాన్ని అనుమానాస్పదం చేస్తున్న రీతిలో ఉంది.
ఈ చట్టం చరిత్రలో నిలిచిపోతుందని ప్రధాని మోడీ తమ భుజాలు తామే చరుచుకుని ఉండవచ్చు గాక.. కానీ.. పైకి కనిపించకపోయినా.. దేశంలోని ముస్లింలను ప్రభుత్వం వివక్షతో చూస్తున్నదనడానికి ఇది తార్కాణం. దీనిని సభ్య సమాజం గర్హించాలి.