ఇంత కాలానికైనా సీఎం జగన్‌కు ఉపయోగపడే ఓ చక్కటి వార్తను రాసినందుకు ‘సాక్షి’ని అభినందించాల్సిందే. జగన్ సర్కార్ ఏపీలో ఆంగ్లమాధ్యమం ప్రవేశ పెట్టాలనే నిర్ణయంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సందర్భంలో…ఇంతకూ మీ పిల్లలు ఏ మాధ్యమంలో చదువుతున్నారో చెప్పాలని ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్‌కల్యాణ్‌లను పేరుపేరునా జగన్ నేరుగా ప్రశ్నించి, నిలదీసి నోళ్లు మూయించాల్సి వచ్చింది.
నిజానికి వారి కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ చదువుతున్నారనే సమాచారాన్నిలోకానికి తెలియజేసే పనిని సాక్షి మీడియా చేయాల్సి ఉంది. ఎందుకంటే ఆ పత్రికకు వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి చైర్పర్సన్ కాబట్టి. జగన్ సర్కార్‌కు ఉపయోగపడే వార్తలను సాక్షి ఇవ్వకపోవడం వల్లే జగన్ సీఎం స్థాయిని మరిచి నోరు చేసుకోవాల్సి వచ్చింది.
ఇదే చంద్రబాబు సీఎం హోదాలో ఆంగ్లమాధ్యమం ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకుంటే, ప్రతిపక్ష నేతగా జగన్ వ్యతిరేకించి ఉంటే…వైసీపీ ప్రజాప్రతినిధుల పిల్లలు ఎక్కడెక్కడ ఆంగ్లమాధ్యమాల్లో చదువుతున్నారో ఫొటోలతో సహా ఎల్లో మీడియాలో ప్రచారం చేసేవారు కాదా? కానీ సాక్షిలో వృత్తి నైపుణ్యం పోయి, పైరవీలకు పెద్దపీట వేస్తుండడంతో ‘న్యూస్సెన్స్’ కొరవడి, ‘న్యూసెన్స్’ రాజ్యమేలుతోంది.
‘మాకు ఆంగ్లం…మీకు తెలుగు’ శీర్షికతో సాక్షిలో ఆసక్తికర కథనాన్ని ప్రచురించారు. టీడీపీ, జనసేనలో కీలక నేతలంతా తమ పిల్లల్లో ఒక్కరిని కూడా తెలుగు మీడియంలో చదివించలేదంటూ ‘సాక్షి’ పరిశోధించిన అంశాలను కథనంగా ఇచ్చారు. నారా లోకేశ్ జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌లో ఇంగ్లిష్ మీడియంలో, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్లో చదివాడని, ఆయన కుమారుడు దేవాన్ష్‌ను హైద రాబాద్‌లోనే (వివరాలు లేవు) ఇంగ్లిష్ మీడియలో చేర్పించినట్టు రాసుకొచ్చారు. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కుమారుడు, కుమార్తెలు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారని రాసారు.
అలాగే టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు కళా వెంకట్రావు మొదలుకుని మండలి బుద్ధప్రసాద్, ఇతర టీడీపీ నేతలు, జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌తో పాటు ఆయన పిల్లలు ఎక్కడెక్కడ చదివారో, చదువుతున్నారో సమగ్ర వివరాలతో కథనం రాసారు. అయితే ప్రతిపక్షాలకు కరపత్రాలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల యజమానులు రామోజీరావు, రాధాకృష్ణ పిల్లలు, వారి పిల్లలు ఎక్కడెక్కడ చదివారు? చదువుతున్నారో సాక్షి రాయకపోవడం గమనార్హం.
అసలు ప్రతిపక్షాల రాద్ధాంతాలకు మూలకారణమైన ఎల్లోమీడియా యజమానులను సాక్షి విస్మరించడం న్యాయమా? అలాగే టీడీపీతో పాటు ఈనాడు రామోజీరావు నడిపే స్కూళ్లలో కూడా ఏ మీడియంలో విద్యాబోధన జరుగుతోందో సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత సాక్షికి లేదా? ఎందుకంటే అవి వ్యవస్థలుగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి.