కాశ్మీరు అంశంపై విషం కక్కుతున్న సీఎన్ఎన్

జమ్మూ కాశ్మీరు- 370 రద్దు విషయంలో వార్తా సంస్థ సీఎన్ఎన్ మాత్రం విషం కక్కుతోంది. భారత్ ను కార్నర్ చేయడమే తమ లక్ష్యం అన్నట్లుగా వారి కథనాలను వండి వారుస్తున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శుక్రవారం…

జమ్మూ కాశ్మీరు- 370 రద్దు విషయంలో వార్తా సంస్థ సీఎన్ఎన్ మాత్రం విషం కక్కుతోంది. భారత్ ను కార్నర్ చేయడమే తమ లక్ష్యం అన్నట్లుగా వారి కథనాలను వండి వారుస్తున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శుక్రవారం నాడు ఇష్టాగోష్టి సమావేశం జరిపిన నేపథ్యంలో వారు అందించిన వార్తా కథనం కూడా చాలా అభ్యంతరకరంగా ఉంది. భారత్ వైపు తప్పున్నట్లు, భారత్ నిందార్హం అయినట్లు అర్థాలు వచ్చేలా కథనాలను రాశారు.

ఐక్యరాజ్యసమితిలో కాశ్మీరు సమస్య గురించి.. చివరిసారిగా 1971లో చర్చించారు. ఆ తర్వాత చర్చించడం ఇదే. ఇది కూడా అధికారిక చర్చకాదు. చైనా రాసిన లేఖ నేపథ్యంలో జరిగిన ఇష్టాగోష్టి చర్చ మాత్రమే. అయితే కాశ్మీరు సమస్యను దాదాపు యాభయ్యేళ్లపాటూ ఐక్యరాజ్యసమితి పట్టించుకోకుండా వదిలేసింది అన్నట్లుగా సీఎన్ఎన్ కథనాన్ని వండింది. ‘‘వియత్నం యుద్ధం జరిగినప్పుడు, ది డోర్స్ బ్యాండ్ కు చెందిన జమ్ మారిసన్ పారిస్‌లో చనిపోయినప్పుడు, యునైటెడ్ స్టేట్స్ లో సినిమా టకెట్ ధర 1.5 డాలర్లు ఉండినప్పుడు.. ఐరాస కాశ్మీరు గురించి చర్చించింది.

మళ్లీ ఇప్పుడే సమావేశమైంది…’’ అంటూ వారి కథనంలో కవితాత్మకతను ప్రదర్శించారు. ఈ యాభయ్యేళ్లలో చాలాసార్లు చర్చించి ఉండాల్సింది అన్నట్లుగా ఆ వాక్యాలతో సంకేతాలు ఇచ్చారే తప్ప.. ఇన్నాళ్లుగా ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవడానికి అవసరం లేని విధంగా భారత్ లో పాలన సాగుతున్నదనే వాదనను వారు విస్మరించారు. (ఇప్పుడు కూడా ఐరాస జోక్యం చేసుకోలేదు.. కేవలం చైనా లేఖ వలన సమావేశమయ్యారంతే!).

కాశ్మీరు వ్యవహారంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని రాశారు. పాకిస్తాన్ ముందే ఐరాస భద్రతా మండలి సమావేశం కోరిందని, కానీ.. చైనా పుణ్యమాని అది శుక్రవారం జరిగిందని వారు పేర్కొన్నారు. కాశ్మీరు అంశాన్ని భద్రతా మండలి చాలా ఎక్కువకాలం పాటూ పట్టించుకోకుండా వదిలేయడం వల్లనే ఇలా జరిగిందా? అని వారు చర్చించినట్లుగా వార్తలో పేర్కొన్నారు. భద్రతామండలి తాము చేయగలిగిన కనీస చర్య, అధికారిక ప్రకటన చేయడంలో కూడా విఫలమైందంటూ సీఎన్ఎన్ వ్యాఖ్యానిండం విశేషం. సమావేశం ‘ఏమీ తేల్చకుండానే’ ముగిసిందని వారు పేర్కొనడం గమనార్హం.

సమావేశం తర్వాత.. కాశ్మీర్లో  పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయని, ఆంక్షలు సడలిస్తూ… మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయని మీడియాకు చెప్పారు. అయితే సీఎన్ఎన్ తన వ్యాఖ్యల్లో.. కాశ్మీర్ ను భారత్‌లో భాగంగా గుర్తించడానికి కూడా అంగీకరించలేదు. ‘భారత్ నియంత్రణలో ఉన్న కాశ్మీర్‌లో’… అంటూ పదాలను జాగ్రత్తగా ప్రయోగించింది.

ఈ కాశ్మీరు అంశాన్ని మరోసారి టేకప్ చేయడానికి మళ్లీ యాభయ్యేళ్లు పడుతుందా అంటూ ఆవేదన వ్యక్తంచేసింది సీఎన్ఎన్. వ్యవహారం ఈ రెండు దేశాల మధ్య వివాదహేతువు కాగా, సీఎన్ఎన్.. ఇస్లామాబాద్ లోని సోఫియా సైఫీతో కథనం రాయించుకోవడంలోనే సీఎన్ఎన్ బుద్ధి బయటపడుతోంది.

రణరంగం సినిమాపై ప్రేక్షకులు ఏమన్నారంటే