ఇప్పటి రాజకీయ నాయకులంతా తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకునేవారే. తామున్న పార్టీ కష్టకాలంలో ఉంటే ఆదుకోవడానికి లేదా దాన్ని బలోపేతం చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడంలేదు. పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడమో, ఏదైనా కారణాల వల్ల ఒడిదొడుకుల్లో పడిపోవడమో జరిగినప్పుడు మరో మార్గం చూసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప తమను రాజకీయంగా పైకి తెచ్చిన, అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఇచ్చి గౌరవించిన పార్టీని పట్టించుకోవడంలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు టీడీపీ, కాంగ్రెసు పరిస్థితి ఇలాగే ఉంది. తెలంగాణ విషయానికొస్తే ఈ రెండు పార్టీలు తీవ్ర సంక్షభంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు.
ఇదివరకు కాంగ్రెసు, టీడీపీ నేతలంతా పోలోమంటూ టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని అయ్యాక ఈ రెండు పార్టీల చూపు బీజేపీ వైపు మళ్లింది. ఈమధ్య కశ్మీర్‌కు సంబంధించి 370 ఆర్టికల్‌ను రద్దు చేసి మోదీ సర్కారు సంచలనం సృష్టించిన తరువాత అన్ని పార్టీల నుంచి కాషాయం పార్టీకి క్యూ కడుతున్నారు. 'ప్రాణం పోయినా ఉన్న పార్టీని వదలను' అంటూ భీషణ ప్రతిజ్ఞలు చేసిన నాయకులు కూడా కాషాయం కండువా కప్పుకోవడానికి ఉరకలేస్తున్నారు. బీజేపీ జోరుగా నిర్వహిస్తున్న ఫిరాయింపుల మహా యాగంలో సమిధలుగా మారడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
మొన్నటివరకు బీజేపీని తీవ్రంగా విమర్శించిన నేతలు ఇప్పుడు ఆహా ఓహా అంటున్నారు. అధికార తెరాసలోని కొందరు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా 'టచ్' లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర, కేంద్ర నేతలు ఘంటాపధంగా చెబుతుండటంతో ఆ పనే జరిగితే పదవులు వస్తాయని ఫిరాయింపుదారులు ఆశ పడుతున్నట్లు అనిపిస్తోంది. రేపు (18వ తేదీ) హైదరాబాదులో బీజేపీలో చేరికల ఉత్సవం పెద్దఎత్తున చేయబోతున్నారు. అనేకమంది ఆ ఉత్సవంలో చేరబోతున్నారు.
బీజేపీలో చేరతారని ప్రచారం జరిగిన నాయకులను కాంగ్రెసు రాష్ట్ర నాయకత్వం ఎప్పటినుంచో బుజ్జగిస్తోంది. రాయబారాలు నడుపుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఇంటికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ వెళ్లి మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెసు ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతితో రాయబారాలు జరిపారు. ఓ మాజీ మంత్రిని, మరో మాజీ ఎమ్మెల్సీని బుజ్జగించారు. వీరితో మాట్లాడాక వీరెవరూ పార్టీని వీడరని ఓ నాయకుడు ప్రకటించాడు. కాని ఇదే నిజమనుకోలేం కదా. ఉమ్మడి ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన దేవేందర్ గౌడ్ సొంత పార్టీ పెట్టుకొని మునిగిపోయి, మళ్లీ టీడీపీ పంచన చేరారు. ఆ మాజీ మంత్రి త్వరలోనే బీజేపీలో చేరతారట…!
ఆయన వెంట కొడుకు కూడా ఉన్నాడండోయ్…! దేవేందర్ గౌడ్ టీడీపీ అధినేత చంద్రబాబును నానాతిట్లు తిట్టినా పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చిన తరువాత బాబు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారు. ఇది ఈ ఏడాది జూన్‌తో ముగిసింది. ఇక ఈయనకు పనేమీలేదు. టీడీపీ పనైపోయింది. దీంతో బీజేపీపై కన్ను పడినట్లుంది. అనారోగ్యం పాలై చాలా ఏళ్లుగా యాక్టివ్‌గా లేని ఈ నాయకుడికి బీజేపీపై ఎందుకు కన్నుపడిందో మరి. ఆయన రావడం ఖాయమని బీజేపీ నాయకులు చెబుతుంటే, అలాందేమీ లేదని ఈయన చెప్పాడు. మరి ఏం చేస్తాడో చూడాలి.
యువ నాయకులు పార్టీ ఫిరాయిస్తే ఏదోలే భవిష్యత్తు ఉంటుందనుకోవచ్చు. కాని ఏనాడో రిటైర్‌పోయి, అనారోగ్యంతో బాధ పడుతున్నవారు కూడా పార్టీ ఫిరాయింపులకు సై అంటున్నారు. ఉమ్మడి ఏపీలో 'నెలరాజు'గా పేరు పొందిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఏం ఆశించి బీజేపీలోకి వెళ్లారో తెలియదు. ఆయన చాలా ఏళ్లుగా ఖాళీగానే కూర్చున్నారు. ఇలాంటోళ్లు చాలామంది ఉన్నారు. బీజేపీ తెలంగాణలోకి వస్తుందని ఆశిస్తున్న ఫిరాయింపుదారులు అలా జరక్కపోతే ఏం చేస్తారో…! అప్పుడు మరో పార్టీని చూసుకుంటారు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జంప్ అవుతారు.