ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నానికి తరలించదలుచుకున్నాడని స్పష్టమైన తరువాత పచ్చ దళాలు ఇప్పుడు కొత్త పాట అందుకుంటున్నాయి. విశాఖ రాజధాని 13 జిల్లాలో ఏ ఏ ప్రాంతానికి ఎంత దూరం ఉందో గణాంకాలు వివరిస్తూ… తద్వారా ప్రజలలో రాజధాని పట్ల భయాలను పుట్టించడానికి ప్రయత్నిస్తున్నాయి.
అయితే మనకు అర్థం కాని సంగతి ఏమిటంటే రాజధాని నగరంతో సగటు పౌరుడికి పనేమిటి? రాష్ట్ర వ్యాప్తంగా ఏక రీతిగా అమలు కావాల్సిన నిర్ణయాలను తీసుకోవడానికి యంత్రాంగం కొలువు తీరే ప్రదేశం రాజధాని. సామాన్య పౌరుడికి సంబంధించినంతవరకు ఆ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయి అనే అంశం దగ్గరే ఇబ్బందులు ఎదురవుతాయి.
అక్కడ ఎదురయ్యే ఇబ్బందులను అక్కడే, అంటే క్షేత్రస్థాయిలోనే పరిష్కరించుకోవాలి ఉంటుంది. అంతే తప్ప రాజధానికి రావాల్సిన అవసరం ఎవరికి మాత్రం ఎందుకు ఉండాలి? ప్రభుత్వ పథకాల అమలు తీరు తెన్నులు గాడి తప్పి పోకుండా క్షేత్రస్థాయిలో పద్ధతిగా అమలుచేసే వ్యవస్థను పటిష్ఠం చేసినప్పుడు… ఇక రాజధాని ఎక్కడ ఉన్నది అనే అంశానికి విలువలేదు. ప్రజలందరి సాధారణ పౌర జీవితం చాలా సజావుగా నడుస్తూనే ఉంటుంది.
రాజధానికి వెళ్ళడం అనవసరం గా భావించేవారు 90 శాతం పైరవీకార్లు, దళారీలు ఉంటారు. ప్రభుత్వం ఇలాంటి వారి కోసం రాజధాని నిర్ణయం తీసుకోవాలి అనే ప్రశ్న ఇపుడు ప్రజల్లో తలెత్తుతోంది. రాజధాని నగరానికి తమ తమ ప్రాంతాల నుంచి దూరం పెరుగుతుంది అనే అభిప్రాయాన్ని కలిగినంత మాత్రాన ప్రజలందరూ నూటికి నూరు శాతం వ్యతిరేకిస్తారని… ఆ దూరాన్ని బెడదగా భావించి ఉన్నపళంగా వ్యతిరేకిస్తారని అనుకోవడం భ్రమ.
తమ జీవిత కాలంలో పరిపాలన పరమైన అవసరం కోసం రాజధాని నగరం గడప తొక్కని వారు 99 శాతం మంది ఉంటారు. రాజధాని నగరానికి దూరంగా ఎక్కువైపోయింది అనే ప్రచారం.. వారిలో వ్యతిరేకతను ఎందుకు తెస్తుంది. దళారీల వ్యతిరేకతకు ప్రభుత్వం ఎందుకు భయపడాలి? స్వార్ధ ప్రయోజనాలతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే రాజకీయ శక్తుల ప్రేరేపణతో నడుచుకునే వారి ఆందోళనలు కలకాలం నిలబడవు. ఇలాంటి ప్రచారాలు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేయలేవు అని అనుకుంటున్నారు.