తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ఈ దఫా ఎన్నికలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీని తలపిస్తున్నాయి. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ పట్టుదలతో వుంది. అలాగే కేసీఆర్ సర్కార్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పడగొట్టాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా నడుచుకుంటోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు వుందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
టీడీపీలో రేవంత్‌రెడ్డి క్రియాశీలకంగా పని చేశారు. చంద్రబాబు శిష్యుడిగా రేవంత్‌రెడ్డిని టీడీపీ శ్రేణులు ఇప్పటికీ అభిమానిస్తున్నాయి. కేవలం రేవంత్‌రెడ్డిని సీఎం చేసుకోడానికే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో టీడీపీ ఎన్నికల బరి నుంచి తప్పుకుందనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడిని ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు అర్ధరాత్రి వేళ కలుసుకున్నారని విశ్వసనీయ సమాచారం.
ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో సదరు నాయకుడికి చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరుగుతున్న నాయకుడే చంద్రబాబును కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మధ్యంతర బెయిల్‌పై ఉన్న చంద్రబాబునాయుడు తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
తెలంగాణలో కాంగ్రెస్ వస్తే, ఆ ప్రభావం ఏపీలో టీడీపీపై పడుతుందని చంద్రబాబు, లోకేశ్ నమ్ముతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తరువాయి, ఏపీలో టీడీపీ వచ్చినట్టే అని వారు విశ్వసిస్తున్నారు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ నేతలు వెనుక నుంచి ఏం చేయాలో అన్ని పనులు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డికి ఆర్థికంగా, హార్థికంగా అండదండలు అందజేస్తున్నట్టు టీడీపీ నాయకులే ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబుతో ఆయన శిష్యుడు అర్ధరాత్రి భేటీ అయ్యి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు తెలిసింది. కాంగ్రెస్‌కు అండగా నిలవాలని ఇప్పటికే టీడీపీ శ్రేణులకి ఆ పార్టీ పెద్దలు సంకేతాలు ఇచ్చారు. బాబుతో భేటీ అనంతరం కాంగ్రెస్ నాయకుడితో కొందరు టీడీపీ నేతలు మాట్లాడినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకుందనే మాటే గానీ, కాంగ్రెస్ గెలుపు కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది.