దేశానికి బానిసత్వం నుంచి విముక్తిని సాధించడంలో పోరాటం చేసిన పార్టీగా పేర్గాంచిన కాంగ్రెస్ కు మాత్రం బానిసత్వ భావనలు పోతున్నట్టుగా లేవు. తమకు గాంధీల ఫ్యామిలీ తప్ప మరో దిక్కు లేదని కాంగ్రెస్ నేతలు మళ్లీ మొదలుపెట్టారు. త్వరలోనే కాంగ్రెస్ జాతీయాధ్యక్షురాలిగా సోనియాగాంధీ తాత్కాలిక పదవీ కాలం ముగియబోతోందట. ఈ క్రమంలో కాంగ్రెస్ కు కొత్త జాతీయాధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉందట. ఆగస్టు పది నాటికి కొత్త అధ్యక్షుడిని ఎన్నకోవాల్సి ఉందట. అయితే ఈ విషయంలో ఒత్తిడి ఏమీ లేకపోవచ్చు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతే మళ్లీ సోనియానే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగించుకునే సౌలభ్యం కాంగ్రెస్ వాళ్లకు ఉండనే ఉంటుంది.
అయితే కొందరు మళ్లీ రాహుల్ గాంధీకే ఆ బాధ్యతలు దక్కాలి అంటూ మొదలుపెట్టారట. ఏఐసీసీ పగ్గాలు రాహుల్ కే అప్పగించాలని వారు డిమాండ్ చేశారట. కాంగ్రెస్ ఎంపీలే ఈ పాట మొదలుపెట్టారట. మోడీకి ధీటైన నేత రాహుల్ తప్ప మరొకరు కాదని వారు అంటున్నారట. ఇప్పటికే గాంధీల ఫ్యామిలీ భజనపరుడిగా పేర్గాంచిన దిగ్విజయ్ సింగ్ వంటి వాళ్లు ఏఐసీసీ పగ్గాలు రాహుల్ తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరికొందరు అదే పాట మొదలుపెట్టడంతో రాహుల్ తప్ప కాంగ్రెస్ కు మరోగతి లేదనే అభిప్రాయాన్ని వారు కల్పిస్తున్నట్టుగా ఉన్నారు.
సోనియా-రాహుల్ ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గత ఆరేళ్లలో దిగని లోతంటూ లేదు. అంతకు ముందు ఆయా రాష్ట్రాల్లో బలమైన నేతల సహకారంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో నిలబడగా, తమ వైఖరితో సోనియా, రాహుల్ లు అన్ని రాష్ట్రాల్లోనూ నాయకులను దూరం చేసుకున్నారు. అనాలోచిత, భజన పర నేతల చెప్పుడు మాటలతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అయినా వాళ్లు తప్ప తమకు మరో దిక్కులేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సోనియా, రాహుల్ లకు కావాల్సింది అదే కావొచ్చు. మొత్తానికి ఈ పరిణామాలను గమనిస్తే.. కాంగ్రెస్ మళ్లీ కోలుకునే అవకాశాలు దాదాపుగా మృగ్యం అయిపోతున్నాయి. మోడీకి కావాల్సింది కూడా ఇదే. సోనియా-రాహుల్ -ప్రియాంక కాంగ్రెస్ వీళ్ల నాయకత్వంలో ఉండటమే మోడీకి శ్రీరామరక్ష!