ఇక అయ్యన్న కూడా మౌనమేనా?

రాజకీయ నాయకుల అరుపులకు, మౌనానికి కూడా కారణాలు వుంటాయి. వ్యాపార నేపథ్యపు రాజకీయాల్లో అవసరాలే అన్నింటికీ పరమావధిగా వుంటాయి. చిరకాలంగా విశాఖ జిల్లా రాజకీయాల్లో అయ్యన్నపాత్రుడు కీలకంగా వుంటూ వస్తున్నారు. అదే సమయంలో మరో…

రాజకీయ నాయకుల అరుపులకు, మౌనానికి కూడా కారణాలు వుంటాయి. వ్యాపార నేపథ్యపు రాజకీయాల్లో అవసరాలే అన్నింటికీ పరమావధిగా వుంటాయి. చిరకాలంగా విశాఖ జిల్లా రాజకీయాల్లో అయ్యన్నపాత్రుడు కీలకంగా వుంటూ వస్తున్నారు. అదే సమయంలో మరో నాయకుడు గంటా శ్రీనివాసరావుతో ఢీ అంటే ఢీ అంటున్నారు. వీరి మధ్య సామాజిక, సైద్దాంతిక విబేధాలు వున్నాయి. 

సరే, తెలుగుదేశం పార్టీ ఓడిపోయాక వైకాపా అధికారంలోకి వచ్చాక గెలిచిన గంటా సౌండ్ లేకుండా అయిపోయారు. ఓడిన అయ్యన్న మాత్రం కాస్త గట్టిగా సౌండ్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇకపై అయ్యన్న కూడా పెద్దగా నోరు చేసుకునే అవకాశం లేదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి ఎవరికి తోచిన కారణాలు వారు వినిపిస్తున్నారు.

అయ్యన్నకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో మాంచి సువిశాలమైన రిసార్ట్ వుంది. తెలుగుదేశం పార్టీ ఈ విమానాశ్రయాన్ని ప్లాన్ చేసిన టైమ్ లో సుమారు 400 ఎకరాల ఈ రిసార్ట్ ను ఆ విమానాశ్రయంలో కలిపేలా మంత్రి గంటా పావులు కదిపారని వార్తలు వినవచ్చాయి. దాంతో అయ్యన్న ఆగ్రహించి, నేరుగా చంద్రబాబు దగ్గరకే వెళ్లి వ్యవహారం సెటిల్ చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. 

ఇప్పుడు విశాఖ పాలనా రాజధానిగా మారుతోంది. భోగాపురం విమానాశ్రయం పనులు ప్రారంభమవుతున్నాయి. విశాఖలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటవుతాయి. వీటికి భూములు కావాలి. భవనాలు కావాలి. ఇప్పుడు అప్పట్లో గంటా చేసిన ప్రయత్నాన్నే వైకాపా ప్రభుత్వం చేస్తే పరిస్థితి ఏమిటి? అప్పుడు అయ్యన్న అధికారంలో వున్నారు కనుక చంద్రబాబు దగ్గరకు వెళ్లి పని జరిపించుకున్నారు. ఇప్పుడు ఎలా?

ఇదిలావుంటే ఇటీవల విశాఖలో కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని వైకాపా నాయకుడు విజయసాయి రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆయన మానసపుత్రిక. చిత్రంగా ఈ కార్యక్రమాన్ని, మొక్కలను స్పాన్సర్ చేసింది అయ్యన్నకు చెందిన రిసార్ట్ కంపెనీనే అని తెలుస్తోంది. అంటే ఆ విధంగా అట్నుంచి నరుక్కువస్తున్నారన్నమాట. విజయసాయికి ఆ విధంగా దగ్గరయితే ఇక కావాల్సింది ఏముంది?

గంటాకు వైకాపాకు ఎలాగూ కుదిరే అవకాశం సుదూరంలో కూడా కనిపించడం లేదు. గంటాతో సరిపడిన అయ్యన్న ఇటు మొగ్గితే ఉభయ కుశలోపరి అన్నట్లు వుంటుంది. అన్నింటికన్నా వ్యాపార పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు తక్కువ వుంటాయి. మొత్తానికి ఇక విశాఖ జిల్లాలో వైకాపాకు అయ్యన్నతో పెద్దగా సమస్య వుండకపోవచ్చు.

హరీష్ శంకర్ తో సినిమా చేస్తాను