జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని చూసి ఒక వర్గం కళ్లలో నిప్పులు పోసుకుంటూ ఉంది. ఇది సహజం. ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే.. రెండో వర్గంలోని కొందరు దానిని సహించలేరు. అయితే.. తమను మరింతగా తీర్చదిద్దుకుని.. తర్వాతి ఎన్నికలకు సిద్ధం కావడం దానికి పరిష్కారం. అంతే తప్ప.. గెలిచిన వాడిని చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటూ.. గెలిచినోళ్ల మీద బురద చల్లుతూ.. వెనుక గోతులు తవ్వుతూ కుట్రలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కానీ, రాష్ట్రంలో, దేశంలో మాత్రమే కాదు.. విదేశాలకు వెళ్లిన పచ్చదళాలు కూడా ఇప్పుడు అలాంటి నీచకృత్యాలకే పాల్పడుతున్నాయి. ఇటీవలి జగన్ అమెరికా టూర్ మీద, అక్కడి ప్రభుత్వానికి పితూరీల రూపంలో తమ అక్కసునంతా వెళ్లగక్కుతున్నార.
ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి.. ఇటీవల అమెరికాలో పర్యటించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన కావొచ్చు. కానీ… ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పైగా సీఎం అయిన తర్వాత తొలి అమెరికా పర్యటన. సహజంగానే అమెరికాలోని తెలుగువారు ఆయనను అభినందించడానికి ఉత్సాహపడ్డారు. పలుచోట్ల కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించారు. అమెరికాలోని తెలుగుసంఘాల ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు జరిగాయి.
అయితే, బతుకుతెరువు కోసం ఖండాలు దాటి అమెరికా వెళ్లినప్పటికీ.. విశాలదృక్పథాన్ని అలవాటు చేసుకోకుండా.. తమ చుట్టూ కులాల గిరిగీసుకుని ఎప్పటికీ సంకుచితంగానే బతికేవాళ్లు చాలా మందే ఉంటారు. తమని తాము తెలుగువారిగా ఐడెంటిఫై చేసుకోగలిగేవారు కులమత రహితంగా ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. తమని తాము కులాలుగా భావించుకునే వారు… కొన్ని కులాల వారు కార్యక్రమాలకు దూరంగానే ఉండిపోయారు. అక్కడితో ఊరుకున్నా కూడా సరిపోయేది. కానీ.. అంతకంటె భావదారిద్ర్యాన్ని ప్రదర్శిస్తూ.. ఈ సమావేశాలు అనేవి లాబీయింగ్ కోసం జరిగాయంటూ… అక్కడి తెలుగు సంఘాల మీద కొందరు అమెరికా ప్రభుత్వానికి పితూరీలు చేయడం విస్తుగొలుపుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల నిర్వహణలో తానా, ఆటా, నాట్స్, నాటా తదితర అనేక సంస్థలు నేరుగా పాల్గాన్నాయని, అవన్నీ రాజకీయ లాబీయింగ్ చేస్తున్నాయని కొందరు వ్యక్తులు ప్రభుత్వ వ్యవస్థ అయిన ఐఆర్ఎస్ కు ఫిర్యాదు చేశారు. ఐఆర్ఎస్ నిబంధనల్లో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు ఇలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదని ఉంటుందని.. కానీ ఈ సంస్థల నాయకులే.. జగన్ కార్యక్రమాలకు సారథ్యం వహించారనేది వారి ఆరోపణ. ఆ సంస్థలకు నాయకులైనంత మాత్రాన వ్యక్తులుగా వారి స్వేచ్ఛను సంపూర్ణంగా కోల్పోతారా వ్యక్తిగతస్థాయిలో వారిక ఏ పనులూ చేసుకోకూడదా? అనే ప్రాథమిక విచక్షణను కూడా విస్మరించి.. ఇలాంటి బురదచల్లే పనులకు దిగడం విశేషం.
ఈ నాన్ ప్రాఫిట్ సంస్థలు రాజకీయ కార్యక్రమాలను ప్రమోట్ చేసే సమాచారాన్ని తమ సభ్యులకు మెయిల్ ద్వారా పంపారని కూడా మరో ఫిర్యాదు. ఈ కార్యక్రమాలకు అయిన ఖర్చు ఎక్కడినుంచి వచ్చిందో తెలియడం లేదని మరో ఫిర్యాదు. పైగా జగన్మోహన రెడ్డి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ.. ఆయన అనేక ఆర్థిక నేరాల్లో నిందితుడు అంటూ.. తమ సంకుచితత్వాన్ని విరాట్రూపంలో బయటపెట్టుకున్నారు.
కిరణ్ తుమ్మల, నవీన్ యెర్రంనేని, కిషోర్ చలసాని పేర్లతో ఇలాంటి పితూరీలు నిండిన పోస్టు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కంప్లయింటే గనుక నిజమైతే.. అది భావదారిద్ర్యంతో కూడిన కొందరి సంకుచిత మనస్తత్వాలకు నిదర్శనం అని ప్రపంచమంతటా ఉండే తెలుగు ప్రజలు భావిస్తున్నారు.
తెలుగు ముఖ్యమంత్రిని తెలుగు ప్రజలు అభినందించదలచుకున్న సమావేశాన్ని కూడా.. రాజకీయం చేయదలచే నీచబుద్ధుల వారు ఎవరైనా ఉంటే.. వారు తెలుసుకోవాల్సిన సంగతులు ఇంకా ఉన్నాయి. జగన్మోహన రెడ్డి అమెరికా యాత్ర అనేది వ్యక్తిగత పర్యటన. వ్యక్తిగత హోదాలోనే వెళ్లినా.. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మరచిపోకూడదు. అమెరికాలో జరిగిన సభలు, సమావేశాలు రాజకీయ పార్టీ కార్యక్రమాలు కాదు. హాజరైన వాళ్లు అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లే అనడం సరికాదు. వాళ్లు కొత్త ముఖ్యమంత్రిని అభినందించదలచుకున్న తెలుగువాళ్లు అంతే! తమ బుద్ధుల్లో ఈ మాత్రం సానుకూల ఆలోచన లేకుండా.. దాని మీద బురద చల్లడానికి దిగజారడం అనేది ప్రజలు అసహ్యించుకునే సంగతి.
గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమెరికాలో పర్యటించిన సందర్భాల్లో .. కులం కార్డు వాడుకుంటూ పుట్టిన తెలుగు సంఘాలు అనేకం ఆయన అడుగులకు మడుగులొత్తాయి. అప్పట్లో స్పీకరుగా ఉన్న కోడెల శివప్రసాద్, తనది పార్టీ రహితమైన రాజ్యాంగబద్ధ పదవి అని తెలిసినప్పటికీ కూడా.. అమెరికా కార్యక్రమాల్లో పార్టీ చిహ్నమైన పసుపు కండువా కప్పుకుని.. అచ్చంగా రాజకీయ కార్యక్రమాల్లా వాటిని నిర్వహించారు. జగన్మోహనరెడ్డి అంతకు దిగజారలేదు. పార్టీ కండువాలు కప్పుకుని కార్యక్రమాల్లో పాల్గొనలేదు.
జగన్ కు అమెరికాలో దక్కిన తెలుగువారి ఆదరణను చూసి… పచ్చదళాలు ఎంతగా కుతకుత ఉడికిపోయాయో అందరికీ తెలుసు. ఆటోమేటిక్ పద్ధతిలో జ్యోతిప్రజ్వలన జరిగితే.. జగన్ దీపం వెలించడానికి విముఖత చూపించారని, హిందువులను అవమానించారని.. ఎంత నీచమైన, సంకుచితమైన ప్రచారం సాగించారో కూడా ప్రజలు గమనించారు.
ఇప్పుడు ఇలాంటి పితూరీల పర్వం కూడా జగన్ ను చూసి ఓర్వలేకపోతున్న వారు చేస్తున్న అలాంటి మరో ప్రయత్నమే అని ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు అసహ్యించుకుంటున్నారు.