ఒకటా రెండా.. దాదాపు పదేళ్ల కిందట గవర్నర్ గా తెలుగు రాష్ట్రానికి వచ్చారు నరసింహన్! అప్పటి ఏపీ గవర్నర్ ఎన్డీ తివారీ సెక్స్ స్కామ్ లో ఇరుక్కున్నాకా ఆయనను మార్చి తమకు అనుకూలుడు అని ఈ మాజీ ఐపీఎస్ అధికారిని కాంగ్రెస్ వాళ్లు ఏపీకి పంపించారంటారు. అప్పటి హోంమంత్రి చిదంబరం ఆశీస్సులతోనే నరసింహన్ ఏపీకి గవర్నర్ గా వచ్చాడనే అభిప్రాయాలూ వినిపించాయి.
అయితే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. చిదంబరం ఇప్పుడు ఎక్కడున్నారో అందరికీ తెలిసిందే. అయినా గవర్నర్ గా నరసింహన్ మాత్రం కొనసాగుతూ వచ్చారు. ఒక రాష్ట్రానికి ఎవరైనా గవర్నర్ గా పదేళ్ల పాటు సాగిన చరిత్ర భారత దేశంలో ఉందో లేదో రికార్డు పుస్తకాలను వెదుక్కోవాలి. అలాంటి అరుదైన రికార్డు నరసింహన్ కే సొంతం అయినట్టుగా ఉంది!
ఐదేళ్ల కిందటే కాంగ్రెస్ నియమిత గవర్నర్ లను బీజేపీ వాళ్లు శంకరగిరి మాన్యాలు పట్టించారు. అప్పట్లోనే అందరినీ తప్పించినా నరసింహన్ జోలికి మాత్రం రాలేదు! చిదంబరం ఆశీస్సుల మేరకే నియమితం అయ్యారనే ట్యాగ్ ఉన్నా.. నరసింహన్ ను మాత్రం తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా కొనసాగించారు. అందుకు తగ్గట్టుగా నరసింహన్ కూడా బీజేపీకి సానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారనే ముద్రను వేసుకున్నారు.
తరచూ గుళ్లకు వెళ్లే వ్యక్తిని తాము తప్పిస్తే బాగుండదని బీజేపీ వాళ్లే అనుకున్నారేమో! అలా కమలం పార్టీ హయాంలోనూ ఐదేళ్ల పాటు ఎంచక్కా కొనసాగారు. ఒకవేళ ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఎంపీ సీట్లను అనూహ్యంగా నెగ్గి.. నరసింహన్ పై బీజేపీ తెలంగాణ నేతలు వరస ఫిర్యాదులు చేయకపోతే ఇప్పుడు కూడా ఆయనకు బదిలీ మీద అయినా మరో చోట అవకాశం లభించేదేమో!
అయితే నరసింహన్ కు ఇప్పుడు కూడా ఢోకా లేదని.. ఆయనకు కేంద్రంలో కీలక బాధ్యతలు దక్కే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతూ ఉంది. ఆయనను జమ్మూకాశ్మీర్ వ్యవహారాల్లో సలహాదారుగా నియమించవచ్చు అనే టాక్ నడుస్తోంది. ఒకవేళ ఆయనను ఆ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ తరహాలో గనుక నియమిస్తే నరసింహన్ కు అంతకు మించిన గుర్తింపు ఉండకపోవచ్చు!