రాష్ట్రంలో అరాచక పాలన చూసి తట్టుకోలేకపోయారు, అసత్య హామీలతో మోసపోయిన జనాలకు అండగా నిలవాలనుకున్నారు, రాజన్న రాజ్యం అంటే ఎలా ఉంటుందో మరోసారి ప్రజలకు చూపించాలనుకున్నారు. అదే ఉత్సాహంతో అధికారంలోకి వచ్చీ రాగానే సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. నవరత్నాలను పట్టాలెక్కించారు. ప్రతి పైసా లెక్క తేల్చేలా, ప్రజలకు మేలు చేసేలా, అవినీతి, అక్రమాలకు తావులేకుండా చూసేలా తన ఆలోచనలను అమలులో పెట్టారు. రివర్స్ టెండరింగ్ విధానంతో దేశంలోనే సరికొత్త సంచలనానికి తెరతీశారు. కానీ ఏమైంది, సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు అటు కోర్టులు, ఇటు కేంద్రం ఎందుకు అడ్డు తగులుతున్నాయి. అంటే జగన్ తీసుకున్న నిర్ణయాలు మంచివి కావా? ఎవరికీ మేలు చేయవా?
వైఎస్ జగన్ కు ఓ విజన్ ఉంది, ఆయన ఆలోచనల ప్రకారం రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందాలి, అవినీతికి తావులేకుండా చేస్తే సమసమాజం సాధ్యమవుతుంది, పెద్ద, చిన్న అనే తారతమ్యం అంతమవుతుంది. దాని కోసమే ఆయన పాకులాట. పోలవరం ప్రాజెక్ట్ లో జరుగుతున్న అవినీతిని చూసి తట్టుకోలేక రివర్స్ టెండరింగ్ కి వెళ్లబోయారు. కోట్లకు కోట్లు మేతమేసిన కాంట్రాక్ట్ కంపెనీలకు కళ్లెం వేయాలని చూశారు. కానీ గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల ప్రకారం కోర్టులు జగన్ నిర్ణయం అమలుకు అడ్డు తగిలాయి. పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం నవయుగకే అప్పగించాలని తీర్పునిచ్చింది హైకోర్టు.
ఈ తీర్పుపై జగన్ సుప్రీంకు వెళ్లొచ్చు, కానీ అంతలోనే జగన్ సర్కారుకి ఎదురుదెబ్బ అనే ప్రచారం ఊపందుకుంది. ఇక తాజాగా.. పీపీఏల రద్దు వ్యవహారంలో ఢిల్లీలోని విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలు కూడా ఒకరకంగా జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టినట్టే చెప్పుకోవాలి. సంప్రదాయేతర విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గతంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దాన్ని సరిచేయాలంటే ఆ ఒప్పందాలను రద్దు చేసి, కొత్తగా చేసుకోవాలని ఆలోచించారు జగన్. కానీ అదీ సాధ్యం కాలేదు. ఇవే కాదు… జనం మంచి కోసం తీసుకుంటున్న నిర్ణయాలకు చాలాచోట్ల అడ్డంకులు ఎదురవడం చూస్తుంటే.. ఇక జగన్ మాత్రం ఏంచేస్తారు చెప్పండి.
కంపెనీల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని కండిషన్ పెడితే.. సమర్థించాల్సింది పోయి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. మద్యపాన నిషేధం అమలు చేస్తానంటుంటే.. రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతోందని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చి నిరుద్యోగాన్ని పారద్రోలాలని చూస్తే వృథా ఖర్చు అంటూ విమర్శిస్తున్నారు. చూస్తుంటే.. పరిపాలనపై జగన్ తన మార్కు చూపించాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తోంది.
మంచికి ఇవి రోజులు కావు అని అనిపిస్తోంది. నాలుగేళ్లు అందినకాడికి ప్రజా సంపద దోచుకుని ఐదో ఏడాది తాయిలాలు విసిరేసేవారికే ఇవి రోజులు. ఇలాంటి కాలంలో జగన్ నిజంగా సత్తెకాలపు సత్తెయ్యే.