మొన్నటి వరకూ పవన్ కల్యాణ్ వెంట పెద్ద బంట్రోతుల్లా తిరిగారు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు. వారిలో ఒకాయన పాపం మోకాళ్లు అరిగిపోయి, ఆసుపత్రి పాలయ్యారు. చికిత్స పొందుతున్న సమయంలో అయినా పవన్ కల్యాణ్ ఆయనను పరామర్శించినట్టుగా లేరు. మధు అనే ఆ సీనియర్ నేతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయినా కాస్త తీరిక చేసుకుని వెళ్లి పరామర్శించి వచ్చారు.
ఇక అప్పట్లో పవన్ కల్యాణ్ కు బంట్రోతులా తిరిగిన కమ్యూనిస్టు నేత ఇప్పుడు చంద్రబాబు వెంట తిరుగుతూ ఉన్నారు. చంద్రబాబు ఎక్కడకు వెళితే అక్కడ ఈ ఎర్రన్న కూడా వెళ్తున్నారు. చంద్రబాబు ఎక్కడ జోలె పడితే అక్కడ రామకృష్ణ పక్కనే కనిపిస్తూ ఉన్నారు. ఈ విషయంలో ఆయన సొంత పార్టీకి కూడా అసహనం మొదలైంది.
మూడు రాజధానుల ఫార్ములాకు అనుగుణంగా కర్నూలు సీపీఐ విభాగం తీర్మానం చేసింది. అంతేగాక.. రామకృష్ణ తీరు మార్చుకోవాలనుకున్నట్టుగా కూడా చురకలు అంటించారట అక్కడి నేతలు. అయితే రామకృష్ణ వాటిని వినిపించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడి వెంట తిరుగుతున్నారు. పవన్ వెంట వెళ్లినందుకు కమ్యూనిస్టులు ఏం సాధించారో అందరికీ తెలిసిందే, ఇక చంద్రబాబు వెంట కాళ్లు అరిగేలా తిరుగుతూ వీరు ఏం సాధిస్తారో కూడా అందరూ అంచనా వేయదగినదే.