ఈ కాషాయం.. పవన్ కల్యాణ్ కు కషాయం

ఢిల్లీ వెళ్లారు, హంగామా చేశారు, బీజేపీతో చేతులు కలిపారు. రేపోమాపో అధికారికంగా పొత్తు ప్రకటన రావడం ఖాయంగా కనిపిస్తోంది. అంతా బాగానే ఉంది. పవన్ కల్యాణ్ కు అధికారికంగా ఓ భరోసా దొరికింది. పార్టీకి…

ఢిల్లీ వెళ్లారు, హంగామా చేశారు, బీజేపీతో చేతులు కలిపారు. రేపోమాపో అధికారికంగా పొత్తు ప్రకటన రావడం ఖాయంగా కనిపిస్తోంది. అంతా బాగానే ఉంది. పవన్ కల్యాణ్ కు అధికారికంగా ఓ భరోసా దొరికింది. పార్టీకి ఫండింగ్ దొరికేసింది. కానీ ఒకటే సమస్య. బీజేపీ మార్క్ రాజకీయంలో పవన్ కల్యాణ్ ఇమడగలడా? కాషాయపు ఫార్ములాకు జనసేనాని ఫిట్ అవుతాడా?

భారతీయ జనతాపార్టీ రాజకీయం చాలా ప్రత్యేకం. స్థానికంగా ఉండే సమస్యలు దానికి అనవసరం. సమస్య ఏదైనా దానికి మతం రంగు ఎలా పులమాలి, రాములోరిని ఎలా ట్యాగ్ చేయాలని మాత్రమే ఆ పార్టీ చూస్తుంది. ఇలాంటి రాజకీయాలు పవన్ కే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా కొత్త. రేపు ఉదయం ఈ లైన్ లో ఓ వివాదాన్ని రేపమని పవన్ ను బీజేపీ ఆదేశిస్తే, అతడు ఆ పని చేయగలడా? 

తన రాజకీయ జీవితానికి ఇబ్బంది అవుతుందనే భయంతో తనకు చెందిన కాపు సామాజిక వర్గానికి బహిరంగంగా మద్దతు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు పవన్. తెరవెనక ఆ వర్గానికి పవన్ ఎన్నయినా చేయొచ్చు, బాహాటంగా మాత్రం మద్దతు ఇవ్వలేడు. ఇంకా చెప్పాలంటే కమ్మోళ్లకు చంద్రబాబు ఇస్తున్నంత సపోర్ట్ కూడా పవన్, తన కాపులకు ఇవ్వలేడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా ముస్లిం మైనర్టీ వర్గానికి దూరమయ్యే పరిస్థితి రాబోతోంది. దీనికి పవన్ సిద్ధమేనా?

ఇక్కడ చంద్రబాబు యాంగిల్ ను కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వెన్నుపోటు వీరుడు బాబు, గతంలో తన మామతో పాటు ఎన్నో పార్టీలకు వెన్నుపోటు పొడిచినట్టే.. గత ఎన్నికల్లో బీజేపీని కూడా నిలువునా మోసం చేశారు. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు నుంచి వ్యూహాత్మకంగా బీజేపీని పక్కనపెట్టారు. అలాంటి చంద్రబాబుకు స్వయానా దత్తపుత్రుడైన పవన్ కల్యాణ్ ను బీజేపీ ఏ మేరకు విశ్వసిస్తుందనేది మిలియన్ డాలర్ ప్రశ్న.

ప్రస్తుతం మోడీకి, అమిత్ షాకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే ఎంపీల్ని పంపించారు, ఇప్పుడు పవన్ తో కూడా తెరవెనక రాయబారం నడుపుతున్నారేమో అనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు బాబు, అటు బీజేపీ రాజకీయాల మధ్య పవన్ నలిగిపోవడం ఖాయమనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మళ్లీ ఎన్నికలొచ్చే సమయానికి జనసేన పార్టీ, ఆటలో అరటిపండు అయిపోతుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

అంటే.. ప్రస్తుతం పొత్తు కోసం పవన్ ను వాడుకుంటారన్నమాట. ఎన్నికల టైమ్ కు బీజేపీ-టీడీపీ కలిసిపోయి పవన్ ను కూరలో కరివేపాకు చేస్తారనేది ప్రధానమైన విశ్లేషణ. సో.. ఎట్నుంచి ఎటు చూసుకున్నుప్పటికీ బీజేపీతో చేతులు కలపడం జనసేన పార్టీకి ఏమంత లాభదాయకం కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కు ఇంతకుమించి మరో ఆప్షన్ లేదు. టీడీపీతో నేరుగా భుజం భుజం కలపలేరు, కమ్యూనిస్టుల్ని మరోసారి అక్కున చేర్చుకోలేరు. ఆయన ముందున్న ఆప్షన్ కేవలం కాషాయం కప్పుకోవడం, కషాయం మింగడం మాత్రమే.