సాధారణంగా టాలీవుడ్ లో ఏ సినీ వారసుడు అయినా తన తొలి సినిమా సమయంలో తన తాత పేరునో, తన తండ్రి పేరునో చెప్పుకుంటాడు. అది ఇండస్ట్రీ తీరు. దాదాపుగా సినీ వారసులే రాణించే పరిశ్రమ ఇది. మిగతా వారికి అంత తేలిక కాదు. తమకు ఎంత మంది పిల్లలుంటే అంతమందినీ సినిమాల్లోకి తీసుకొచ్చి, వారిని హీరోలుగా ప్రజెంట్ చేసి జనాల మీద రుద్దుతూ ఉంటారు ఇండస్ట్రీలోని పెద్ద మనుషులు. అయితే ఎంత రుద్దినా నిలబడేది మాత్రం ఎంతో కొంత టాలెంట్ ఉన్న వాళ్లే.
అలాంటి వారసుల్లో ఒకడిగా ఇండస్ట్రీకి వచ్చి సెటిలైన హీరో అల్లు అర్జున్. అయితే ఇప్పుడు ఈ హీరో, ఇన్నేళ్ల తర్వాత తన తాత పేరును, తన తండ్రి పేరును స్ట్రెస్ చేస్తూ ఉన్నాడు! తను అల్లు రామలింగయ్య మనవడిని అంటున్నాడు బన్నీ. ఇన్నాళ్లూ ఆ విషయం ఎవరికీ తెలియదు అని కాదు. ప్రత్యేకంగా ఇప్పుడు ఒత్తి చెప్పుకొంటూ ఉండటంలో ఆ హీరో ఉద్దేశం ఏమిటనేది ఆసక్తిదాయకంగా మారింది.
ఇన్నాళ్లూ చాలా వరకూ మెగాస్టార్ మేనల్లుడు అనే గుర్తింపే బన్నీకి ఎక్కువగా దక్కింది. అతడి తండ్రి టాలీవుడ్ లో దశాబ్దాలుగా బడా ప్రొడ్యూసరే అయినా, అతడి తాత టాలీవుడ్ ఒకనాటి స్టార్ కమేడియన్ అయినా.. అంతకు మించి స్టార్ డమ్ కలిగిన చిరంజీవి మేనల్లుడిగానే బన్నీకి ఎక్కువ గుర్తింపు దక్కింది. అయితే ఇప్పుడు తను అల్లు రామలింగయ్య మనవడిని అంటూ.. తమ వంశవృక్ష ప్రస్తావన ద్వారా అల్లు అర్జున్.. సొంత కుంపటిని హైలెట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నాడని పరిశీలకులు అంటున్నారు.
చిరు ట్యాగ్ నుంచి పూర్తిగా బయటపడిపోయి.. అల్లు ఫ్యామిలీ ప్రత్యేకం అనిపించుకోవాలనే ప్రయత్నంలా ఉంది ఇదంతా అంటున్నారు. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీల్లా..బంధుత్వం ఉన్నా వేర్వేరుగా తమ ఉనికిని చాటుకుంటున్నట్టుగా అల్లు ఫ్యామిలీ కూడా తమ స్కూల్ డిఫరెంట్ అనబోతోందా?