Advertisement

Advertisement


Home > Politics - Gossip

రాజధాని తరలింపు ప్రకటన అప్పుడేనా?

రాజధాని తరలింపు ప్రకటన అప్పుడేనా?

జగన్మోహన రెడ్డి.. తాత్కాలిక అసెంబ్లీ సమావేశానికి ముహూర్తం నిర్ణయించారు. అసెంబ్లీ కార్యదర్శి ఎమ్మెల్యేలకు పంపిన వర్తమానం ప్రకారం.. ఈ నెల 20న  శాసనసభ సమావేశం అవుతుంది. మరురోజు శాసనమండలి సమావేశం ఉంటుంది. జీఎస్ రావు కమిటీ, బీఎస్‌జీ కమిటీ, వాటిని మధించి.. ప్రభుత్వం విధించిన హైపవర్ కమిటీ రూపొందించిన నివేదికల గురించి శాసనసభ చర్చిస్తుంది. ఇదీ తాజా షెడ్యూలు.

అయితే అనధికారికంగా అమరావతి వర్గాల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి.. ఈ రెండు రోజుల్లోనే రాజధానిని విశాఖపట్టణానికి తరలించడానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. అన్ని కమిటీలను సావధానంగా పరిశీలించిన మీదట, తదనుగుణమైన కమిటీల నివేదికలు వచ్చిన తరువాత.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా దీనిని ప్రకటిస్తారు. ఇక ఎలాంటి వివాదాలకు ఆస్కారం రేగకుండా.. అసెంబ్లీ సాక్షిగానే.. చర్చల అనంతరం తీసుకున్న నిర్ణయంగా ప్రకటించి.. రాజధానిని తరలించే పర్వానికి శ్రీకారం చుడతారు.

అప్పటిదాకా అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలను జాగ్రత్తగా కాపుగాస్తే చాలుననే అభిప్రాయం అధికార పార్టీకి చెందిన పలువురిలో వ్యక్తం అవుతోంది. ప్రతిరోజూ అక్కడ దీక్షలు జరుగుతూనే ఉన్నాయి. ఈలోగా ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగకుండా.. జాగ్రత్తగా చూసుకుంటే.. ఒకసారి ప్రభుత్వం తరఫు నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత.. ఇక దీక్షలు బలహీనపడతాయనేది పలువురి అంచనా.

అదే విధంగా.. ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసిన వెంటనే.. తరలింపు ప్రక్రియను కూడా మొదలెట్టేస్తారు. ఇప్పటికే విశాఖలో వివిధ రాజధాని అవసరాలకు సంబంధించి.. భవనాల ఎంపిక కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే తరలింపు మొదలవుతుంది. ఎటూ రాజధానిగా ప్రకటించకపోయినప్పటికీ.. గణతంత్ర దినోత్సవాన్ని విశాఖ సాగర తీరం వేదికగానే చేపట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తరలింప లాంఛన ప్రకటన అనేది అసెంబ్లీ తాత్కాలిక సమావేశాల నాడే తేలిపోతుందని పలువురు అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?