పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎడాపెడా చెలరేగుతున్న ప్రస్తుత తరుణంలో ఆయన మీద పాలకపక్షం కన్నెర్ర చేయడంలో ఆశ్చర్యం లేదు. ఆ రకంగా వైకాపా వారికి ఆయన టార్గెట్ అయితే అందులో వింతేమీ లేదు. కానీ.. పవన్ కల్యాణ్ క్రిస్టియన్ మిషనరీలకు కూడా టార్గెట్ అవుతున్నారు. పవన్‌ను బద్నాం చేయడానికి మిషనరీలు చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా జనసేన పార్టీనుంచి పాలిట్ బ్యూరో సభ్యుడు, తెలంగాణకు చెందిన నాయకుడు రాజు రవితేజ ఆ పార్టీకి రాజీనామా చేయడం వెనుక కూడా ఇలాంటి ప్రోద్బలం ఉన్నట్లుగా తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒక రేంజిలో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కేవలం ప్రభుత్వ పరిపాలన పరమైన నిర్ణయాల వరకే పరిమితం కావడం లేదు కూడా. ఆ విషయంలో తెలుగు మీడియం గురించి ఆయన చేస్తున్న ఆందోళనలు ఒక ఎత్తయితే మతపరంగా కూడా ఆయన కొన్ని సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు.
తిరుమల గిరుల్లో అన్యమత ప్రచారం జరుగుతున్నదంటూ క్రిస్టియన్ మిషనరీల కార్యకలాపాల గురించి ఆయన తిరుపతి పర్యటనలో పెద్దస్థాయిలో గళమెత్తారు. అలాగే కృష్ణ నది పుష్కర ఘాట్ లలో బాప్టిజం చేయించిన ఘటనల గురించి కూడా ఆయన విమర్శలు చేశారు. ఆ వీడియలోను కూడా విడుదల చేశారు. ఇలాంటి నేపథ్యంలో క్రిస్టియన్ మిషనరీలు ఆయనను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది.
మరోవైపున పవన్ కల్యాణ్- జనసేన పార్టీ కేంద్రంలోని మోడీ-భాజపాకు దగ్గరవుతున్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. మోడీ విధానాల గురించి పవన్ సానుకూలంగా వేర్వేరు సందర్భాల్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఇలాంటి పోకడ కూడా మిషనరీల కన్నెర్రకు కారణం అని తెలుస్తోంది.
వారి ప్రోద్బలంతోనే.. క్రిస్టియన్ అయిన రాజు రవితేజ పార్టీకి రాజీనామా చేశారని సమాచారం. అదొక్కటే కాకుండా పవన్ కల్యాణ్ మీద విశాఖలో జనసేననుంచి గతంలో బయటకు వెళ్లిన మరో క్రిస్టియన్ నాయకుడు అలివర్ రాయ్ పోలీసు కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘటనలను పరిశీలించినప్పుడు.. పవన్ కల్యాణ్ రాజకీయంగానే కాకుండా, మతపరంగా మిషనరీలకు టార్గెట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.