రాజధాని తరలింపు అంశానికి సంబంధించి… చెలరేగుతున్న ఆందోళనలు.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న తీరును గమనించి.. ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీ ఆందోళనకు గురవుతోంది. తక్షణం ఈ ఆందోళనలను చల్లబరచాలంటే.. ఏమేం చేయాలో తేల్చడానికి మల్లగుల్లాలు పడుతోంది. అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలు ఉధృతం అవుతున్న వేళ.. వారిని శాంతపరచడంతో పాటూ.. ఇతర పర్యవసానాలేమీ లేకుండా ఉండాలంటే.. తక్షణం రాజధానిని మార్చేయడమే పరిష్కారంగా వారు భావిస్తున్నారు. జాగు జరిగే కొద్దీ.. పరిస్థితి మరింత విషమిస్తోందనే భయం, ఆందోళన హైపవర్ సమాలోచనల్లో కనిపిస్తున్నట్లుగా ఉంది.
జగన్మోహన రెడ్డి సర్కారు మూడు రాజధానుల కాన్సెప్టును తెరమీదికి తెచ్చిన తర్వాత.. సుదీర్ఘ కసరత్తునే చేస్తోంది. ముందుగానే రాజధాని గురించి జీఎస్ రావు కమిటీ వేసింది. జగన్ అసెంబ్లీలో ఒక ప్రకటన చేసిన తర్వాతే ఆ కమిటీ నివేదిక వచ్చింది. ఆ తర్వాత కొన్ని వారాలకు అందిన బీసీజీ కమిటీ నివేదిక కూడా అచ్చంగా అదే ఆలోచనను సమర్థించింది. మూడు రాజధానులు ఉండాలనే చెప్పింది. అయితే జగన్ అక్కడితో ఊరుకోకుండా.. దానిని మరింత మధించాలన్నట్లుగా.. ఈ రెండు నివేదికల్ని పరిశీలించి.. సిఫారసులు రూపొందించాల్సిందిగా మరొక హైపవర్ కమిటీ వేశారు.
ఈ కమిటీ మరికొంత కాలయాపన చేయడమే తప్ప.. తొలినాడు జగన్ ప్రకటించిన మాటకే జైకొడుతుందనడంలో సందేహం లేదు. నిజానికి ఇదంతా అనవసర కాలయాపన. ఈలోగా.. అమరావతి ప్రాంతంలో ఆందోళనలను పెరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఈ ఆందోళనలను రాష్ట్రమంతా విస్తరింపజేసే వ్యూహంతో అడుగులు వేస్తోంది. బందరు, రాజమండ్రి లలో ఆందోళనలు చేయించారు. తిరుపతి ఇతర ప్రాంతాలకు కూడా ఇవి విస్తరించనున్నాయి.
రాజధాని తరలింపు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ అధికారికంగా ప్రకటించడమూ, లేదా తరలింపు అనే ప్రక్రియను ప్రారంభించేయడమూ ఎంత త్వరగా జరిగితే ప్రభుత్వం అంత సేఫ్ గా ఉంటుందని అనుకోవచ్చు. రైతులను బుజ్జగించడానికి ఏంచేయాలి, ఆందోళనలు ఎలా చల్లార్చాలి? ఆలస్యం చేయకూడదు.. అనే అంశాలే తాజాగా హైపవర్ కమిటీ భేటీలో కూడా తేలినట్లు తెలుస్తోంది. మరి వీరి మేధోమధన ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.