ఈసారి ఎన్నికలు చాలా ఛండాలంగా జరిగాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా పెద్దఎత్తున రంకెలు వేశారు. ఈసీని ఒక రేంజిలో దుమ్మెత్తి పోశారు. పోలింగ్ లో అక్రమాలు జరిగాయని… ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని రకరకాల ఆరోపణలు చేశారు. ఇన్ని జరిగినప్పటికీ.. తాజాగా చంద్రగిరిలో ఎన్నికలకు సంబంధించి.. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టులాగా కనిపిస్తోంది.
చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన తీరు మీద.. అక్కడి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దానికితోడు.. ఆ వ్యవహారాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల అధికార్ల నుంచి కూడా సమాచారం తెప్పించుకుంది. అన్నింటినీ క్రోడీకరించుకుని… మొత్తానికి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని అయిదు పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్నికలు ముగిసిన దాదాపు నెలరోజుల తర్వాత… రీపోలింగ్ నిర్ణయం రావడం ఆసక్తికరం.
చంద్రగిరి ఎన్నికల్లో అనేక అరాచకాలు జరిగాయని.. ఒకవర్గం వారిని అసలు ఓట్లు వేయనివ్వకుండా అడ్డుకుని.. అక్రమాలకు పాల్పడ్డారని వైకాపా అభ్యర్థి ఈసీకి తెలియజేశారు. ఈ ఫిర్యాదులను ఈసీ పరిగణనలోకి తీసుకుంది. అందుకే అయిదు బూత్ లలో రీపోలింగ్ నిర్వహించనుంది. ఈ నిర్ణయం చూసిన ఎవరికైనా సరే.. చంద్రబాబునాయుడు ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే అనే సామెత నీతిని అనుసరిస్తున్నారని అనిపిస్తుంది.
ఎన్నికలు జరిగిన నాటినుంచి.. వైకాపా అనేక అక్రమాలకు పాల్పడిందని, ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. అయితే తాజాగా చంద్రబాబు పార్టీ వాళ్లు మితిమీరి వ్యవహరించిన బూత్ లలోనే రీపోలింగ్ ఆదేశాలు రావడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఈ నిర్ణయం చంద్రబాబును ఖంగుతినిపించేదే. చంద్రబాబు ఈసీ మీద ఎంత దుమ్మెత్తిపోసినా.. వాస్తవంలో ఆయన పార్టీ వారే అక్రమాలకు పాల్పడినట్లుగా ఈసీ తేల్చేసినట్టు ఈ రీపోలింగ్ నిర్ణయం ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.