Advertisement

Advertisement


Home > Politics - Gossip

తొలిసారి కౌంటర్ ఇచ్చిన జగన్!

తొలిసారి కౌంటర్ ఇచ్చిన జగన్!

జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. పరిపాలనలో భాగంగా ఆయన తీసుకున్న నిర్ణయాల గురించి వివాదాలు రేగడం వెంటనే మొదలైంది. ఇప్పటిదాకా చాలా నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ప్రభుత్వం తక్షణం కూలిపోవాలన్నంత రేంజిలోనూ విమర్శలు వచ్చాయి. జగన్‌ను ప్రజాద్రోహిగా చిత్రించే ప్రయత్నాలూ జరిగాయి.. ఎన్నడూ ఆయన స్పందించలేదు. నోరు విప్పి కౌంటర్ మాటలు వేయలేదు. కానీ తొలిసారిగా.. ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టే విషయంలో జగన్ కౌంటర్ లు ఇస్తున్నారు? ఎందుకిలా.. ఈ విషయంలో స్వయంగా స్పందిస్తున్నట్లు??

ప్రజావేదికను కూల్చేసినప్పుడు, కృష్ణాతీరంలో ఆక్రమించి కట్టుకున్న భవనాలకు నోటీసులు ఇచ్చినప్పుడే విమర్శలు విచ్చలవిడిగా మొదలయ్యాయి. ఇసుక కొత్త విధానం తీసుకురావడంలో.. ఆ విమర్శలు మితిమీరి వచ్చాయి. ప్రత్యర్థులు హద్దుల్లేకుండా చెలరేగిపోయారు. అమరావతి రాజధాని అనే విషయంలో ఎంతెంత పెద్ద రాద్ధాంతాలు చేశారో అందరూ చూశారు. ఇంకా అనేక రకాలుగా ఆయనకు తాటాకులు కట్టే ప్రయత్నం చేశారు.

కానీ జగన్ ఎన్నడూ పట్టించుకోలేదు. ఆయా విమర్శలను ఖాతరు కూడా చేయలేదు. నిజానికి అది వైఎస్ రాజశేఖర రెడ్డి శైలి. అర్థం పర్థం లేని విమర్శలు వచ్చినప్పుడు.. తానుగా స్పందించకుండా ఉండడం ద్వారా.. ఆ విమర్శలకు విలువలేకుండా చేసేయడం ఆయన శైలి. ప్రత్యేకించి అమరావతి విషయంలో, ఇసుక విషయంలో ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా.. తాను తన పరిధిలో అధికార్ల సమీక్ష సమావేశాలు పెట్టుకున్నారే తప్ప.. వాటికి జవాబు  ఇవ్వడానికి జగన్ ప్రయత్నించలేదు.

కానీ తొలిసారిగా తెలుగు మీడియంను రాష్ట్రంలో పూర్తిగా తొలగించి.. ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టాలనులకునే నిర్ణయం విషయంలో ఆయన కౌంటర్లు వేస్తున్నారు. తెలుగు మీడియం తొలగింపుపై రేగిన వివాదం గురించి జగన్ తొలిసారిగా నోరువిప్పి మాట్లాడారు. ఎందుకిలా? ఆ నిర్ణయం విషయంలో ఎక్కడో తన ద్వారా చిన్న తప్పు జరుగుతున్నదనే భావన జగన్ లో కూడా లోలోపల కాస్త ఉన్నట్లుంది.

తన ద్వారా తప్పు జరుగుతోందని అనుకోబట్టే... జగన్ స్వయంగా తనను తాను సమర్థించుకోడానికి ఇలాంటి ప్రకటనల ద్వారా, ఎదురుదాడుల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు అనుకోవాల్సి వస్తోంది. ఏం పర్లేదు జగన్.. మీరు వెనక్కి తగ్గి ఇంగ్లిషు మీడియంను అన్ని స్థాయుల్లో అందుబాటులో ఉంచి.. ఆప్షనల్ గా ఏర్పాటుచేస్తే.. దానిని మీ ఓటమికింద ఎవ్వరూ అనుకోరు. పైగా హర్షిస్తారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?