Advertisement

Advertisement


Home > Politics - Gossip

శివసేన- కాంగ్రెస్ పల్లకీ మోయాల్సిందే!

శివసేన- కాంగ్రెస్ పల్లకీ మోయాల్సిందే!

శివసేన పార్టీ చరిత్ర ఎలాంటిది? ఆ పార్టీ మూలాలు ఎలాంటివి? కాంగ్రెస్ వ్యతిరేకత నరనరానా జీర్ణించుకుపోయిన, కరడుగట్టిన హిందూత్వ భావజాలంలో భాజపాను మించిన మూలాలు ఆ పార్టీకి ఉన్నాయి. అయితే ఇప్పుడు మహారాష్ట్ర పరిణామాల్లో ఆ పార్టీ ఖర్మ కాలినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు వారు కాంగ్రెస్ పల్లకీ మోయాల్సి వచ్చేలా కనిపిస్తోంది. భాజపాను కాలదన్నుకున్న తర్వాత.. శివసేనకు ప్రభుత్వం ఏర్పాటు చేసేఅవకాశం వచ్చినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వారు ఫెయిలయ్యారు. దీంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.

శివసేన కు గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు. సోమవారం సాయంత్రం 7.30 వరకు వారికి గడువు ఇచ్చారు. ఆలోగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అంటూ.. మద్దతిచ్చే సభ్యుల జాబితాను గవర్నరు కార్యాలయానికి ఇవ్వడంలో శివసేన విఫలమైంది. సాయంత్రం గవర్నరు వద్దకెళ్లి మరో మూడు రోజుల గడువు కావాలని కోరింది. ఇప్పటికే.. రాష్ట్రానికి ప్రభుత్వానికి దిక్కులేకుండా ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని అనుమతిస్తున్న ఆయన నో చెప్పారు. పైగా మద్దతుకు ఎక్కువ గడువు ఇవ్వడం అనేది ఖచ్చితంగా బేరసారాలకు తెరతీస్తుందనేది అందరూ అనుకునే సంగతి. వారిని పక్కకు పెట్టి... ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి.. మంగళవారం సాయంత్రం 8.30 వరకు వారికి ఆయన గడువు ఇచ్చారు.

ఇక్కడ ఫెయిల్యూర్ అనేది శివసేన వైపులోనే ఉంది. ఎందుకంటే.. భాజపాకు మద్దతివ్వరాదని వారు ఎన్నడో అనుకున్నారు. మరి మిగిలిన పార్టీలతో ముందునుంచి చర్చలు జరుపుతూనే ఉన్నారు. కానీ.. గడువులోగా ఆ ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలం అయ్యారు. అలా అవకాశం చేజారిపోయింది.

ఇప్పుడేమైంది? ఎన్సీపీకి అవకాశం వచ్చింది. జట్టులోని కాంగ్రెస్ తో కలిపి వారికి 98 మంది బలం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. శివసేన వారి పల్లకీ మోయాల్సి వస్తుంది. వారికి మద్దతిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించాల్సి ఉంటుంది. ఒకవేళ సీఎం పోస్టులో వాటా అడిగినా కూడా.. తొలిరెండున్నరేళ్ల అవకాశం ఇస్తారనేది కల్ల. మరి సెకండ్ హాఫ్ లో సీఎం కుర్చీ యిస్తారో లేదో..? లేదా ప్రభుత్వాన్నే కూల్చేస్తారేమో..? ఈలోగా జమిలి ఎన్నికలు ముంచుకొచ్చి ప్రభుత్వం రద్దవుతుందేమో? అన్నీ అనుమానాలే! ఆ రకంగా ఇప్పుడు శివసేన అవకాశం చేజార్చుకుని కాంగ్రెస్ పల్లకీని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?