టీడీపీ యువ నాయకుడు, ఆ పార్టీ భవిష్యత్ సారథి నారా లోకేశ్‌పై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కోపంగా ఉన్నారు. అందుకే లోకేశ్ పాదయాత్రలో జయదేవ్ పాల్గొనలేదు. లోకేశ్‌పై జయదేవ్ కోపానికి దారి తీసిన వైనం గురించి టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రగిరి టికెట్ విషయమై ఇద్దరి మధ్య మనస్పర్థలకు దారి తీసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం గల్లా కుటుంబానికి అడ్డా. కాంగ్రెస్ తరపున గల్లా జయదేవ్ తల్లి అరుణకుమారి అనేక దఫాలు ఆ నియోజకవర్గం నుంచి తిరుగులేని విజయాలు సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా పని చేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌పై జనాల్లో తీవ్ర వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని టీడీపీలో గల్లా అరుణ, ఆమె తనయుడు జయదేవ్ చేరారు.
ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచి అరుణ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయారు. గల్లా జయదేవ్ మాత్రం గుంటూరు ఎంపీగా గెలుపొందారు. అప్పటి నుంచి గల్లా అరుణకుమారి రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. జయదేవ్ మాత్రం యాక్టీవ్‌గా వున్నారు. 2019లో అరుణకుమారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దీంతో చంద్రగిరి టీడీపీ టికెట్‌ను పులివర్తి నానికి ఇచ్చారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేతిలో నాని ఓడిపోయారు.
మారిన రాజకీయ పరిస్థితుల్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని గల్లా జయదేవ్ ఆలోచనగా చెబుతున్నారు. ఈ మేరకు చంద్రబాబు నుంచి అనుమతి కూడా పొందినట్టు సమాచారం. కానీ పాదయాత్రలో భాగంగా పులివర్తి నాని చంద్రగిరి టీడీపీ అభ్యర్థిగా లోకేశ్ ప్రకటించారు.
తాను చంద్రగిరి నుంచి నిలబడాలనే ఆకాంక్షను బయట పెట్టడంతో పాటు బాబు నుంచి అనుమతి పొందిన తర్వాత పులివర్తి నాని పేరు ప్రకటించడంపై గల్లా జయదేవ్ సీరియస్ అయ్యినట్టు ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి లోకేశ్‌తో అంటీముట్టనట్టు జయదేవ్ వ్యవహరిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో లోకేశ్ పాదయాత్ర చేరుకున్నా, అటు వైపు కన్నెత్తి చూడకపోవడానికి అదే కారణమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.