ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి. ప్రభుత్వంలో ఆలోచన కలిగించేలా ఉండాలి. తమ చర్యల్లో లోపం ఉంటే పునరాలోచన కలిగించేలా ఉండాలి. అంతే తప్ప.. పాలకపక్షం మీద బురద చల్లడం ఒక్కటే లక్ష్యంగా.. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా సాగిపోకూడదు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత.. తీసుకున్న నిర్ణయాల్లో ప్రజలకు ఇచ్చగించని వాటిలో అన్నక్యాంటీన్ల మూసివేత కూడా ఒకటి. దానికి నిరసనగా ఇవాళ తెలుగుదేశం పార్టీ సంకల్పించిన పోరాటం మాత్రం మంచిదే.
రాష్ట్రంలోని అన్ని అన్న క్యాంటీన్ల ఎదుట సోమవారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. వంటా వార్పు నిర్వహించి ఆ భోజనాల్ని అక్కడకు వచ్చే పేదలకు వడ్డిస్తారన్నమాట. అన్న క్యాంటీన్ల మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకించడంలో, ఆ నిర్ణయం పట్ల ప్రజల్లో ఆలోచన, ప్రభుత్వంలో అపరాధభావం కలిగించడంలో ఇలాంటి పోరాటం పద్ధతి ఉపయోగపడుతుంది. అయితే ఇది డ్రామాగా మిగిలిపోకుండా వాళ్లు జాగ్రత్త తీసుకుంటే మంచిది.
ఇవాళ తెదేపా పోరాటం కాబట్టి.. వండే సమయానికి పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలే అక్కడకు జమవుతారు. వాళ్లే వండుకుని, వాళ్లే తినేసి.. జగన్ ను తిడుతూ కొన్ని నినాదాలు చేసి వెళ్లిపోతారు. అక్కడితో వ్యవహారం ముగిసిపోతుంది.. కానీ ఈ వ్యవహారం అలా సాగకూడదు.
అన్న క్యాంటీన్లలో ఇదివరకు నిర్వహించినట్టుగా అన్ని రకాల పదార్థాలతో భోజనాలు వడ్డించినట్లుగా కాకుండా.. కనీసం ఏ సాంబారన్నమో, పెరుగన్నమో.. ఆకలివేసిన సమయానికి పేదవాడి కడుపు నింపడానికి కొంత అందేలా.. వారే పూనిక తీసుకుని 5 రూపాయలు మించకుండా ప్రతిరోజూ అందించేలా ఏర్పాటు చేయాలి.
ప్రతి అన్న క్యాంటీన్ ఎదుట.. ప్రతి మధ్యాహ్నం.. ఇలాంటి ఏర్పాటు చేస్తే ప్రభుత్వంలో కూడా ఆలోచన వస్తుంది. పునరాలోచన చేసే అవకాశం ఉంటుంది. నిజంగానే అలాంటి ప్రయత్నం వల్ల పేదలకు అవసరానికి కడుపు నిండుతుంది. ఆ మాత్రం చేయడానికి అన్న క్యాంటీన్ లు ఉండేస్థాయి ఊళ్లలో స్థానికుల నుంచి విరాళాలు సేకరించినా సరిపోతుంది.
పచ్చజెండాల ముగు వేయకుండా ఉంటే.. పేదవాడి కడుపు నింపడానికి అంటే.. పార్టీ రహితంగా ఇవ్వడానికి కూడా పలువురు మొగ్గు చూపుతారు. ఇలా నిర్దిష్టమైన ప్రణాళికతో చేస్తే ప్రజలకు కూడా మేలు జరుగుతుంది తప్ప.. ఇలాంటి ఒకరోజు వంటావార్పు డ్రామాల వల్ల రాజకీయ మైలేజీ తప్ప మరేమీ ఒరగదు.