Advertisement

Advertisement


Home > Politics - Gossip

కేసీఆర్ పై బీజేపీ 'ఆర్టీసీ' అస్త్రం

కేసీఆర్ పై బీజేపీ 'ఆర్టీసీ' అస్త్రం

ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణకు తమిళనాడు బీజేపీనేత తమిళ సైని తీసుకొచ్చి గవర్నర్ గా చేశారో, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకునే దిశగా కమలదళం అడుగులు వేస్తోంది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెలో తమ రాజకీయ లబ్ధిని వెదుక్కుంటోంది. ఓ వర్గాన్ని పూర్తిగా రెచ్చగొట్టి.. కేసీఆర్ పై వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేయిస్తోంది. ప్లాన్ లో భాగంగా గవర్నర్ ను మెల్లమెల్లగా రంగంలోకి దించుతోంది భారతీయ జనతా పార్టీ. ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులతో నిరసనలు చేయిస్తూ.. గవర్నర్ తమిళ సై ఈ సమస్యను పరిష్కరించాలని వారితో చెప్పిస్తోంది.

ప్రజలే గవర్నర్ ను వేడుకుంటున్నట్టు, ప్రజల అవసరాల దృష్ట్యా గవర్నర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ సమస్యపై సమీక్ష జరుపుతున్నట్టు సీన్ క్రియేట్ చేయబోతున్నారు బీజేపీ నేతలు. ఆర్టీసీ సమ్మెపై ఇప్పటివరకు గవర్నర్ కలుగజేసుకోలేదు. కనీసం అధికారుల నుంచి నివేదిక కూడా కోరలేదు. ఇప్పుడు ఈ అంశంపై తొలిసారి గవర్నర్ దృష్టిపెట్టే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే తెలంగాణలో కొత్త గవర్నర్ హ్యాండిల్ చేయబోయే తొలి సమస్య ఇదే అవుతుంది.

ఇప్పటివరకూ తెలంగాణకు గవర్నర్ గా ఉన్న నరసింహన్.. కేసీఆర్ కి పూర్తిగా వంతపాడేవారు. సకల జనుల సమ్మె టైమ్ లో, కాంగ్రెస్ హయాంలో కాస్త విభేదించారు కానీ, కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రమక్రమంగా ఉత్సవ విగ్రహంగా మారారు గవర్నర్ నరసింహన్. అందుకే ఆయన స్థానంలో బీజేపీ వ్యూహాత్మకంగా తమిళసై ని రంగంలోకి దించింది. ఈ మార్పు కచ్చితంగా కేసీఆర్ ని ఇబ్బంది పెట్టేదే అని అప్పట్లోనే రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అలా అదను కోసం వేచి చూసిన బీజేపీ నేతలు, ఇప్పుడు ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో గవర్నర్ ను తెరపైకి తీసుకొస్తున్నారు.

తెలంగాణ బంద్ కు ప్రతిపక్షాలన్నీ సిద్ధమవుతున్న వేళ, బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరించబోతోంది. నేరుగా గవర్నర్ తోనే ప్రకటన చేయించి, ఆర్టీసీ సమ్మెలో ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరించే ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నేరుగా కార్మిక సంఘాల నేతలు, ఆర్టీసీ అధికారులతో గవర్నర్ ప్రత్యేక భేటీ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి ఆర్టీసీ వివాదాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆర్టీసీని అస్త్రంగా, గవర్నర్ ని పావుగా వాడుకోవాలని  నిర్ణయించింది. ఇదే కనుక జరిగితే.. రాజ్ భవన్ వేదికగా.. తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరు షురూ అవ్వడం ఖాయం.

అఖిలప్రియ.. కేరాఫ్ గందరగోళ రాజకీయం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?