ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో రవి ప్రకాష్ పై ఇప్పటికే అనేక అనుమానాలు రేగుతూ ఉన్నాయి. ఆయన మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని, ఆయనపై ధర్యాప్తు జరగాలని కూడా ఫిర్యాదులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మెరుగైన సమాజానికి పాటుపడుతున్నట్టుగా ప్రకటించుకుంటూ వచ్చిన రవి ప్రకాష్ గురించి రకరకాల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ క్రమంలో అఫ్రికాలో రవి ప్రకాష్ కేబుల్ సామ్రాజ్యం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దాదాపు పదేళ్ల కిందట రవి ప్రకాష్ ఆఫ్రికాలో కేబుల్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. వాస్తవానికి అంతకన్నా మునుపే కంపాలా సిటీ కేబుల్ అంటూ తెలుగువాళ్లు ఒక సంస్థను మొదలుపెట్టారు. అందులో వాటాలను రవి ప్రకాష్ కొన్నాడట.
అయితే ఆ కొనుగోలు లోనే లొసుగులు ఉన్నాయని తెలుస్తోంది. ఆ కేబుల్ సామ్రాజ్యం రవి ప్రకాష్ చేతుల్లోకి రావడం వెనుక గోల్ మాల్ ఉందని సమాచారం. పద్నాలుగేళ్లుగా వ్యాపారం చేస్తున్న ఈ సంస్థకు మొత్తంగా 10 వేల కనెక్షన్లు ఉన్నాయనుకున్నా… ఆ లెక్కన నెలకు రూ.1.7 కోట్లు వసూలు అవుతాయి. ఈ 1.7 కోట్లలో రూ.70 లక్షలను ఖర్చుల కింద తీసేసినా నెలకు అథమంగా కోటి రూపాయలు ఖాయంగా మిగులుతుందన్నది ఉగాండాలో కేబుల్ వ్యాపారం గురించి బాగా తెలిసిన వర్గాల మాట. అంటే కంపాలా సిటీ కేబుల్ యజమానులకు నెలకు రూ.కోటి చొప్పున ఏడాదికి రూ.12 కోట్లు లాభంగా వస్తోందనేది ఇక్కడ గమనించాల్సిన అంశం.
2009 నవంబరు 27న కంపాలా సిటీ కేబుల్ లిమిటెడ్ వ్యాపారంలోకి ప్రవేశించిన రవిప్రకాష్… అదే రోజున 2,35,000 షేర్లను దాదాపు 40 కోట్ల షిల్లింగ్ లు వెచ్చించి అధికారికంగా కొనుగోలు చేశారు. 40 కోట్ల షిల్లింగ్ లంటే మన కరెన్సీలో దాదాపు 80 లక్షల రూపాయలన్న మాట. ఇంకా చిత్రమేమిటంటే… అదే రోజున సీహెచ్.వి.ఆర్.సుబ్బారావు అనే వ్యక్తి కూడా దాదాపు 16 కోట్లకు పైగా షిల్లింగ్ లను వెచ్చించి 23,850 షేర్లు కొనుగోలు చేశారు. అంటే మన కరెన్సీలో దాదాపు 34 లక్షలు వెచ్చించారు. దాదాపు 34 లక్షల రూపాయలు వెచ్చించిన సుబ్బారావు అనే వ్యక్తికి 23,850 షేర్లు దక్కాయి. అంటే ఆయన ఒకో షేరును రూ.140 లెక్కన కొనుగోలు చేశారన్న మాట.
రవిప్రకాష్ కు మాత్రం రూ.80 లక్షలకే 2,35,000 షేర్లు దక్కాయి. అంటే ఆయన ఒకో షేరుకు రూ.35 మాత్రమే చెల్లించారన్న మాట. కానీ ఇద్దరు కొనుగోలు చేసిందీ నవంబరు 27, 2009 నాడే. మరి ఇద్దరి ధరలోనూ ఎందుకింత తేడా? సుబ్బారావుకు కొనుగోలు చేసిన ధరకే రవిప్రకాష్ కూడా కొనుగోలు చేసి ఉంటే మొత్తంగా రూ.3.29 కోట్లు చెల్లించి ఉండాలి కదా!! అధికారికంగా 80 లక్షలే చెల్లించారంటే మిగతా రెండున్నర కోట్లను హవాలా వంటి ఇతర మార్గాల్లో ఏమైనా చెల్లించారా? మనీ లాండరింగ్ మార్గాల్లో తరలించారా? లేకుంటే ఆ షేర్లు విక్రయించినవారికి రవిప్రకాష్ పై అంత ప్రేమ ఎందుకుంటంది? వారికి ఈయన వేరే రకంగా ఏమైనా ఉపయోగపడ్డారా? ఇవన్నీ లోతైన విచారణ జరిపితే తప్ప తేలే అంశాలు కావన్నది సుస్పష్టం.
ఇక్కడింకా కీలకమైన ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది నెలకు రూ.కోటికి పైగా నికరంగా లాభం వచ్చే వ్యాపారాన్ని ఎవరైనా కోటి రూపాయలకన్నా తక్కువ మొత్తానికి విక్రయించేస్తారా అన్నది. కొంచెం ఇంగితజ్ఞానం ఉన్నవారెవరైనా అలా చెయ్యరనే చెబుతారు.