గులాబీ వర్గ రాజకీయాలకు ఇది సంకేతమా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. మునిసిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే ఉద్దేశంతో.. సమావేశం నిర్వహించారు. పార్టీ నిర్ణయించిన వారే ఫైనల్ అని, తిరుగుబాటు అభ్యర్థులు ఎవ్వరూ నామినేషన్లు వేయడానికి వీల్లేదని…

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. మునిసిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే ఉద్దేశంతో.. సమావేశం నిర్వహించారు. పార్టీ నిర్ణయించిన వారే ఫైనల్ అని, తిరుగుబాటు అభ్యర్థులు ఎవ్వరూ నామినేషన్లు వేయడానికి వీల్లేదని చాలా ఘాటుగా హెచ్చరించారు. బుజ్జగింపు బాధ్యతలు మొత్తం ఎమ్మెల్యేల మీద పెట్టారు. బుజ్జగింపు వారికి కుదరకపోతే గనుక.. తిరుగుబాటు అభ్యర్థులను పార్టీనుంచి బహిష్కరిస్తామని, తర్వాత ఎప్పటికీ చేర్చుకోబోమని కూడా సన్నాహక సమావేశంలోనే ఘాటుగా హెచ్చరించారు. ఆదిలోనే ఇంత ఘాటు హెచ్చరికలు.. యథాలాపంగా వచ్చినవేనా? వీటి వెనుక  మరేదైనా మర్మసందేశం ఉందా? అన్నది ఇప్పుడు తెలంగాణ గులాబీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉంది.

పైకి ప్రకటితంగా కనిపించకపోయినప్పటికీ.. తెరాసలో వర్గ రాజకీయాలు పుష్కలంగా ఉన్నాయి. పైకి మాత్రం అంతా గుంభనంగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల సీజను వచ్చింది గనుక.. పై స్థాయి నుంచి  క్షేత్ర స్థాయి వరకు ఉన్న వర్గ రాజకీయాలు ఒక్కసారిగా బయల్పడే అవకాశం ఉన్నదని… పార్టీ నిఘా వర్గాలే అనుమానిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే కేసీఆర్ ముందస్తుగా ఒకటోనెంబరు హెచ్చరికలు జారీచేశారు.

కేసీఆర్ మాటలను బట్టి.. ఒక సంకేతం అందుతోంది. అప్రతిహతంగా కొనసాగుతున్న అధికార పార్టీ గనుక.. కారు గుర్తుపై ఎవరు పోటీచేసినా గెలుస్తారనే ధీమా నాయకత్వంలో మాత్రమే కాదు.. ప్రజల్లో కూడా చాలా వరకు ఉంది. గులాబీదళం హవాకు తోడుగా.. విపక్షాలు కూడా పూర్తిగా బలం పుంజుకున్న వాతావరణం లేదు. ఇలాంటి నేపథ్యంలో.. టికెట్ల కేటాయింపులో అచ్చంగా ఒక వర్గానికే పెద్దపీట వేసే అవకాశం ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు. రాష్ట్రస్థాయి నాయకత్వం నుంచి ఉన్న వర్గాల తారతమ్యాలే ఈసారి క్షేత్రస్థాయిలోనూ ప్రతిబింబిస్తాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నాయకుల్లో సాగుతున్న చర్చను బట్టి.. అచ్చంగా ఒక వర్గానికి మాత్రం ప్రాధాన్యం దక్కుతుంది. కేసీఆర్ బెదిరిస్తున్నట్లుగా రెండో వర్గం నామినేషన్లు వేయకుండా ఊరుకునేది ఉండదు. కేసీఆర్ బహిష్కరించే దాకా వారు వేచిఉండకపోవచ్చు. భాజపా, కాంగ్రెసు రెండూ ఓ మోస్తరు బలంతోనే ఉన్నాయి గనుక.. వాటిలో ఏదో ఒక పార్టీని ఆశ్రయించి.. బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేదా.. గులాబీ పార్టీలో సర్వత్రా ఒకే వర్గానికి అన్యాయం జరిగితే గనుక.. వారందరూ గంపగుత్తగా ఒకే పార్టీలో చేరి బరిలోకిదిగి, భిన్నమైన సంకేతాలను తమ నాయకత్వానికి పంపవచ్చు. గులాబీ రాజకీయాల్లో మునిసిపల్ ఎన్నికల పర్వం ఎలాంటి కుదుపులు తీసుకువస్తుందో వేచిచూడాలి.