ఏపీలో రాజధానుల ఆట రసవత్తరంగా సాగుతోంది. అందరూ కలిసి 'రాజధాని' అనే పదాన్ని చాలా చులకన చేస్తున్నారు. దానికున్న విలువను గంగలో కలుపుతున్నారు. ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడైతే మూడు రాజధానులు అన్నారో అప్పటినుంచి రాజధాని అనే పదానికున్న అర్థమే మారిపోయింది. జగన్ చెప్పింది పరిపాలన రాజధాని అంటే ఎగ్జిక్యూటివ్ కేపిటల్, లెజిస్లేచర్ రాజధాని అంటే శాసన రాజధాని, జ్యుడీషియల్ కేపిటల్ అంటే న్యాయ రాజధాని. ఈ మూడు రాజధానుల్లో ఏమేమి ఉంటాయో తెలిసిన సంగతే.
రాయలసీమవాసులు రాజధాని అమరావతిలోనే ఉంచాలని, అది సాధ్యం కాకుంటే కర్నూలులో పెట్టాలని అంటున్నారు. రాజధాని కర్నూలు పెట్టకపోతే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఇవ్వాలంటున్నారు. ప్రకాశం జిల్లావారు తమ జిల్లాకు రాజధాని ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. మంద కృష్ణమాదిగ దొనకొండలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు. జీఎన్‌రావు కమిటీ విజయనగరంలో రాజధాని ఏర్పాటు చేయాలంది. ఇలా రాజధానిపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. సరే…ఈ కథ ఇలా నడుస్తుండగా జగన్ కేబినెట్లో ఉన్న హౌసింగ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు ఓ ఐడియా వచ్చింది.
మూడు రాజధానుల ప్లాన్ బాగానే ఉందిగాని మరో రాజధాని జగన్ మర్చిపోయారని ఈయన అనుకున్నాడు. ఇంతకూ ఏమిటది? 'సాంస్కృతిక రాజధాని'.అంటే కల్చరల్ కేపిటల్. మరి ఇది చాలా ముఖ్యం కదా. కల్చరల్ కేపిటల్ లేకపోతే ఆంధ్రజాతికి కల్చర్ లేదని అనుకుంటారేమోనని శ్రీరంగనాథ రాజుకు సందేహం కలిగింది. ఈ రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుంది? వెంటనే ఆయనకు 'వేదంలా ఘోషించే గోదావరి…అమరథామంలా విలసిల్లే రాజమహేంద్రి' అనే పాట గుర్తొచ్చింది.
ఎస్….సాంస్కృతిక రాజధానిగా రాజమహేంద్రవరమైతే చాలా బాగుంటుంది అనుకున్నాడు. అదే అభిప్రాయాన్ని బయటకు చెప్పాడు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ చెవిలో వేస్తానన్నాడు. కల్చర్ ఎంత ఇంపార్టెంటో జగన్‌కు వివరిస్తే ఆయన ఒప్పుకుంటాడని ఈయన నమ్మకం కావొచ్చు. కొన్ని రోజుల తరువాత మరో మంత్రికి క్రీడలకున్న ప్రాముఖ్యం గుర్తొచ్చి 'అయ్యా…ముఖ్యమంత్రిగారూ..తమరు క్రీడా రాజధాని గురించి మర్చిపోయారు' అని చెబుతాడేమో.
ఇలా ఒక్కో జిల్లాలో ఒక్కోటి ఏర్పాటు చేసి ఇది ఫలాన దానికి రాజధాని అని ప్రకటిస్తే ఆ జిల్లావాసులు సంతోషపడతారేమో…! ఇలా ప్రతి జిల్లాలో ఒక్కో అంశానికి రాజధాని ఏర్పాటు చేస్తే ఆ జిల్లాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయని నాయకుల అభిప్రాయం కావొచ్చు. ఏ జిల్లా అయినా అభివృద్ధి చెందాలంటే దాన్ని ఏదో ఒకదానికి రాజధానిగా ప్రకటిస్తే సరిపోతుందా? చూద్దాం ఇంకా ఏ మంత్రికి ఏం ఐడియా వస్తుందో…!