ఇది బాబు నేర్పిన విద్య కాదా?

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నది వెనకటికి కావ్య వాక్యం.  Advertisement అలాగే తమలపాకుతో నువ్వు ఒకటి అంటే తలుపు చెక్కతో నేను ఒకటి అంటా అన్నది నానుడి. ఇప్పుడు చంద్రబాబు తెలుసుకోవాల్సింది ఇదే.…

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నది వెనకటికి కావ్య వాక్యం. 

అలాగే తమలపాకుతో నువ్వు ఒకటి అంటే తలుపు చెక్కతో నేను ఒకటి అంటా అన్నది నానుడి.

ఇప్పుడు చంద్రబాబు తెలుసుకోవాల్సింది ఇదే. కర్మ బూమరాంగ్ లాంటిది.అది తిరిగి,తిరిగి మనదగ్గరకే వస్తుంది. తెలుగునాట, ఆ మాటకు వస్తే, భారత దేశంలోనే మీడియాను స్వంత రాజకీయాల కోసం వాడుకోవడం అన్నది స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ తరువాత ఆ విద్యలో ఆరితేరి, ఆంధ్రలో ప్రతిపక్షాన్ని, కిట్టని వాళ్లని బదనామ్ చేసి, జనాల దృష్టిలో పనికిరాని వాళ్లను చేసే విద్యను ఔపాసన పట్టి, అద్భుతంగా ప్రయోగించింది చంద్రబాబే.

అలాగే రాజకీయ పార్టీలో ఓ మీడియా విభాగం. అందులో సీనియర్ జర్నలిస్ట్ లు, రోజువారీ బులిటెన్ లు, ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఎలా ఇరుకునపెట్టాలి అనే అంశంపై పాయింట్ల వారీగా బులిటెన్ లు ఇవన్నీ సంస్థాగతం చేసింది ఆయనే. అసలు అంతెందుకు, అను కుల మీడియా ద్వారా క్యారెక్టర్ అసాసినేషన్ అనే విద్యను కనిపెట్టి అమలు చేసిన ఘనత ఆయనదే కదా? బురద జల్లేసి కడుక్కోమని వదిలేసే విద్య ఆయన కనిపెట్టిన సిలబస్ నే కదా?

ఆ తరువాత సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత దాన్ని చాలా తెలివిగా రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బతీయడానికి వాడుకున్నదీ ఆయనే. ఈ విద్య చూసి, తాము కూడా అదే బాటలో పయనించడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తే, ఎక్కడ, ఏ ఊరిలో వున్నవాడినైనా గుంటూరు ప్రాంతంలో కేసులు వేయించి, లాక్కొచ్చి, జైల్లో పడేయించి, బెయిల్ రాకుండా చూసి, నానా పాట్లు పెట్టిన ఘనత కూడా చంద్రబాబుదే. 

ఈ పాయింట్లు కాదని ఎవ్వరైనా అనగలరా?

సరే, కర్మ అనేది బూమరాంగ్ కదా? తిరిగి తిరిగి వాళ్ల వాళ్ల దగ్గరకే వస్తుంది కదా? ఇప్పుడు చంద్రబాబు అండ్ తెలుగుదేశం పరిస్థితి కూడా అదే. అధికారం చేజారింది. గట్టిగా ఏడాది కూడా పూర్తి కాలేదు. కానీ వైకాపా కార్యక్రమాలతో, చర్యలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. 

దాంతో గతంలో అధికారం చేపట్టకముందు ఏవిధంగా అయితే జగన్ మీద సోషల్ మీడియా ద్వారా దాడి చేయించారో మళ్లీ అదే వ్యూహానికి, అవే అస్త్రాలకు పదును పెట్టారు. కానీ వ్యవహారం గతంలోలా వుండదు కదా? ఇప్పుడు వైకాపా అధికారంలో వుంది. పైగా సోషల్ మీడియా మీద ఈవిధంగా కేసులు పెట్టొచ్చు అని బాబుగారు గత అయిదేళ్లలో చేసి చూపించారు. దాంతో ఇప్పుడు అధికారంలో వున్న వైకాపా ప్రభుత్వం అదే చేస్తోంది. దాంతో బాబుగారు గగ్గోలు పెడుతున్నారు.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. సోషల్ మీడియాలో ఎదుటవారిపై విమర్శలు చేయడం, తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం తప్పు కాదు. కానీ వాటికీ ఓ పద్దతి గట్రా వుంటుంది. కట్టుబాటు దాటితే కష్టమే. ఇప్పటికే జనసేన పార్టీ తమ తమ పార్టీ సభ్యులు సోషల్ మీడియాలో ఎలా ప్రవర్తించాలో? ఎలా పద్దతిగా నడుచుకోవాలో? కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. 

అయినా కూడా సోషల్ మీడియాలో హద్దులు దాటుతున్న వారు దాటుతూనే వున్నారు. జనసేన కార్యకర్త అని చెప్పుకుంటూ, ఆ మధ్య విజయమ్మ, షర్మిల, భారతిలపై కనీసం మాట్లాడుకోవడానికి లేదా ప్రస్తావించడానికి కూడా వీలు లేనంత అసహ్యంగా ఫేస్ బుక్ లో కామెంట్లు పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను చేసినది తప్పు అని క్లియర్ గా తెలుస్తోంది కనుక జనసేన పార్టీ తన కార్యకర్తను వెనకేసుకు రాలేదు.

చంద్రబాబు కూడా ఈ వైనం గమనించాలి. చట్టం పరిథిలో సోషల్ మీడియాలో విమర్శలు ఎలా చేయాలి? విమర్శలు సహేతుకుంటా ఎలా వుండాలి? ఎక్కడ హద్దులు దాట కూడదు అన్నది తమ పార్టీ సోషల్ మీడియా విభాగం జనాలకు క్లియర్ గా బోధించాలి. అప్పుడు కూడా ప్రభుత్వం అరెస్టులు సాగిస్తే కచ్చితంగా నిలదీయవచ్చు. 

అంతే కానీ, తాము చేస్తే సంసారం, వేరే వాళ్లు చేస్తే మరేదో అన్న టైపులో ఆక్రోశం వెలిబుచ్చకూడదు. అయినా ఇప్పుడే ఎనర్జీ అంతా ఖర్చు చేసి, అస్త్రాలు అన్నీ వాడేస్తే, ఇంకా మరో నాలుగేళ్ల పాటు బాబుగారు ఎలా నెగ్గుకువస్తారో? ఆయన తప్ప పార్టీ జనాలకు ఇవేమీ పట్టడం లేదు. అందువల్ల ఆయన కాస్త సహనంతో కొన్నాళ్లు వేచి వుండడం అవసరమేమో?