నిస్సిగ్గుతనానికి తోడు నీతిమాలిన పనులు!

సాధారణంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసి అధికారంలో ఉన్న పార్టీ పరాజయం పాలైతే… ఆ పార్టీ ముఖ్యమంత్రి తన పదవీకాలం మరికొన్ని రోజులు తన పదవి ఉన్నప్పటికీ రాజీనామా చేసి గౌరవం కాపాడుకుంటారు. అలాగే సదరు…

సాధారణంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసి అధికారంలో ఉన్న పార్టీ పరాజయం పాలైతే… ఆ పార్టీ ముఖ్యమంత్రి తన పదవీకాలం మరికొన్ని రోజులు తన పదవి ఉన్నప్పటికీ రాజీనామా చేసి గౌరవం కాపాడుకుంటారు. అలాగే సదరు ప్రభుత్వ దయాప్రాప్తమైన నామినేటెడ్ పదవులను అనుభవించే సమస్త వందిమాగధులూ కూడా… తమ తమ పదవులకు రాజీనామాలు చేసేస్తారు. కొత్త ప్రభుత్వం వెళ్లగొట్టేదాకా ఉండడం ఎందుకులెమ్మని పరువుగా పక్కకు తప్పుకుంటారు.

ఇదంతా స్వాభిమానమూ, ఆత్మగౌరవమూ గురించి ఆలోచించే వాళ్ల సంగతి. అవేవీ పట్టించుకోని… ఎవరేం అనుకుంటే మనకేం లెద్దూ… దక్కిన అధికార కుర్చీలోంచి యీడ్చి పారేసే దాకా అడ్డగోలుగా దండుకుందాం అనుకునే వారికి అడ్డేముంటుంది. ఇలా పదవుల్లో కొనసాగడమే నిస్సిగ్గుతనం అనుకుంటే… దానికితోడు నీతిమాలిన పనులకు కూడా తెగించడం తిరుమల తిరుపతి దేవస్థానాల ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కే చెల్లింది.

తెలుగుదేశం ప్రభుత్వం గద్దెదిగిపోగానే.. వారు ప్రసాదించిన నామినేటెడ్ పదవుల్లోంచి పలువురు తప్పుకున్నారు. రాజీనామాలు చేసేశారు. అయితే తితిదే ఛైర్మన్, మాజీమంత్రి యనమలకు వియ్యంకుడు అయిన పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం రాజీనామా చేయలేదు. కుర్చీనే అంటిపెట్టుకు కూర్చున్నారు. సభ్యులు కూడా పలువురు రాజీనామాలు చేసేసినా… ఆయనకు మాత్రం చీమకుట్టినట్టయినా అనిపించలేదు. ఈ నేపథ్యంలో జీవో ద్వారా ఆయనను పదవీచ్యుతుడిని చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈలోగా… అంత్యకాలంలో ఉన్న తన పదవిని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా దోచుకోడానికి పుట్టా సుధాకర్ యాదవ్ ప్రయత్నించినట్లుగా ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా అందింది. తితిదే ఆధ్వర్యంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి స్విమ్స్ లో అయినవారికి అడ్డదారిలో ఉద్యోగాలు ఇప్పించుకోవడానికి ఆయన స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ పై ఒత్తిడి చేసినట్లుగా టీటీడీ , రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. నిజానికి ఇదే తరహాలో పుట్టా మే చివరివారంలో బర్డ్ డైరెక్టర్ కు యథేచ్ఛగా పదవి పొడిగింపు ఇవ్వగా ఆ ఫైలుపై సంతకం చేయకుండా ఈవో నిలిపేశారు. దాంతో బర్డ్ డైరెక్టర్ మార్గాంతరం లేక పదవీవిరమణ చేయాల్సి వచ్చింది.

పదవులు దక్కేదాకా… దేవుడి సేవ చేసుకునే భాగ్యం దక్కితేచాలు… అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. తీరా పదవులు దక్కిన తర్వాత… ఉద్యోగాల్లో కమిషన్ల దందాలు , అందుకు అడ్డదారులు తొక్కడాలు లాంటి దిగజారుడు పనులకు పాల్పడడం పలువురికి కంటగింపుగా ఉంది.

గాజువాకలో అయితే బొత్తిగా తృతీయస్థానం