ఎన్నికలు అయిపోయిన ఆరు నెలల తర్వాత సమీక్షలు మొదలుపెట్టారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ముందుగా తెలుగుదేశం చిత్తు చిత్తుగా ఓడిన రాయలసీమకు వెళ్లి చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎలా దుష్ప్రచారం చేయాలో చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలకు సూచిస్తూ ఉన్నారు.
తనవైన ఐడియాలను వాళ్లకు ఇస్తూ చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి వ్యతిరేక ప్రచారం చేయాలంటూ ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక ఈ పర్యటనల్లో చంద్రబాబు నాయుడుకు చిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి. కడప జిల్లాకు వెళ్లి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించగా.. అక్కడ కార్యకర్తలు కొట్టుకున్నారు. చంద్రబాబు నాయుడి ఎదుటే వాళ్లు బాహాబాహీకి దిగారు. వారిని వారించడం చంద్రబాబుకు సాధ్యం కాలేదు.
కొట్టుకున్న అనంతరం ఆ తెలుగు తమ్ముళ్లు వెళ్లి ఒకరి మీద మరొకరు కేసులు పెట్టుకున్నారు. కడప జిల్లా అనుభవాలు అలా ఉంటే.. కర్నూలు జిల్లాలో చంద్రబాబు నాయుడుకు కొంతమంది నియోజకవర్గం ఇన్ చార్జిలు ఝలక్ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి, ఓడిపోయిన వాళ్లు చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాలకు అస్సలు హాజరే కాలేదు.
కొందరు హాజరయ్యి.. చంద్రబాబు చేత క్లాసులు చెప్పించుకున్నారు. మిగతా వాళ్లు మాత్రం అటు వైపు తొంగి చూడలేదని తెలుస్తోంది. నందికొట్కూరు, ఆలూరు వంటి నియోజకవర్గాల ఇన్ చార్జిలతో పాటు.. ఆ నియోజకవర్గాల్లో పని చేసిన ఇతర నేతలు కూడా చంద్రబాబు నాయుడి సమీక్షకు గైర్హాజరు అయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబు సమీక్షలు అలా సాగుతున్నట్టుగా ఉన్నాయి.