ఇప్పటికే వల్లభనేని వంశీ మోహన్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్టుగా ప్రకటించుకున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, ఏ పార్టీకీ చెందని ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదెన్ని రోజులో చూడాల్సి ఉంది.
ఆ సంగతలా ఉంటే.. తెలుగుదేశం పార్టీకి పలువురు ఎమ్మెల్యేలు రాజీనామాకు రెడీ అవుతున్నారని సమాచారం. ప్రస్తుతానికి ముగ్గురు రాజీనామాకు రెడీ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సమాచారం ఇచ్చినట్టుగా భోగట్టా.
వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన వారే ముందున్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి రెడీ అవుతున్నారని సమాచారం.
ఇప్పటికే వీరితో సంప్రదింపులు పూర్తయ్యాయని సమాచారం. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, పేర్నినాని ఈ సంప్రదింపులు పూర్తి చేశారని తెలుస్తోంది.
ఇటీవల బాలినేని ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు గొట్టిపాటి రవికుమార్ హాజరు అయినప్పుడు చర్చలు ముగిశాయని సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లోపే వీరు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చేరవచ్చని తెలుస్తోంది.
ఇప్పటికే శాసనసభలో టీడీపీ బలం 22కి పడిపోయింది, ఈ ముగ్గురూ బయటకు వెళితే 19 కి తగ్గిపోతుంది టీడీపీ బలం. వీరు మాత్రమే గాక.. మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.