పచ్చ భయాలకు ఇదే నిదర్శనం!

గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా ఉంది తెలుగుదేశం నాయకుల పరిస్థితి. ఒకవైపు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా తనకు వీరబీభత్స ప్రోటోకాల్ మర్యాదలు కావాల్సిందేనని కోరుకుంటూ… అలాంటి ఏర్పాట్లు…

గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా ఉంది తెలుగుదేశం నాయకుల పరిస్థితి. ఒకవైపు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా తనకు వీరబీభత్స ప్రోటోకాల్ మర్యాదలు కావాల్సిందేనని కోరుకుంటూ… అలాంటి ఏర్పాట్లు లేకపోతే గనుక తన ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని ప్రచారం చేసుకుంటూ అధినేత చంద్రబాబునాయుడు కాలం గడుపుతున్నారు. మరోవైపు పాత ప్రభుత్వ హయాంలో జరిగిన టెండర్లు, కాంట్రాక్టర్ల వ్యవహారాలు అన్నీ జగన్మోహనరెడ్డి తవ్వ తీస్తుండే సరికి… తతిమ్మా పచ్చదళాలు కూడా బెంబేలెత్తిపోతున్నట్లుగా కనిపిస్తోంది.

దీనికి నిదర్శనం ఏంటంటే… తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ను అర్జంటుగా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదంటూ పార్టీ నాయకులు చంద్రబాబునాయుడు తాజాగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో సూచించేశారు. నిజానికి తెదేపా లీగల్ సెల్ ను చాలా జాగ్రత్తగా నిర్వహిస్తూ, గరిష్టంగా వాడుకోవడంలో చంద్రబాబునాయుడు ఉద్ధండుడే. తెదేపా పార్టీని ఎన్టీఆర్ చేతినుంచి తన హస్తగతం చేసుకోవడం నుంచీ… ఇటీవలి వ్యవహారాల దాకా ఆయనకు అందులో అనుభవం ఉంది.

ఇటీవలి కాలంలో లీగల్ సెల్ నిరుపమాన సేవలకు మెచ్చి కనకమేడల రవీంద్రకుమార్ ను ఆయన రాజ్యసభ ఎంపీ చేశారు కూడా. కాగా, కొత్తగా లీగల్ సెల్ ను బలోపేతం చేసుకోవాలని, వైకాపా ప్రభుత్వం తమపై కేసులు పెట్టి వేధించే అవకాశం ఉన్నదని వాపోవడం ఏమిటో అర్థంకావడం లేదు. తెదేపాకు ఎంతగొప్ప లీగల్ సెల్ ఉన్నా.. ప్రత్యేకహోదా విషయంలో చట్టాన్ని కేంద్రం అమలు చేయలేదంటూ సుప్రీంను ఆశ్రయించే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం చేయలేదు.

విభజన చట్టం గురించి ఓ కేసు నడుస్తోంటే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున డొల్ల వాదనలతో అఫిడవిట్లు వేసి.. మనకు హక్కుకాగల అధికారాల్ని కూడా మంటగలిపేశారు. తీరా ఇప్పుడు వైకాపా మీద బురద చల్లడానికి.. కేసులు పెట్టి వేధిస్తారనే భయాలు వ్యక్తంచేస్తూ… లీగల్ సెల్ వైపు చూస్తున్నారు. నిజానికి తెదేపా నేతలు ఒక్కొక్కరు ఎన్నెన్ని అక్రమాల్లో ఇరుక్కుని ఉన్నారో… ఎంతగా కేసులకు జడుసుకుంటున్నారోనని అనిపిస్తోంది.  

ఓటమిపాలైనా తుదిశ్వాస దాకా రాజకీయాల్లోనే – పవన్